Jun 16,2023 00:03

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : 2023-2024 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ సెస్‌ వసూలు లక్ష్యం రూ.425 కోట్లుగా నిర్థారించినట్లు మార్కెటింగ్‌ శాఖ విజయవాడ రీజియన్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు. సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఆయన గురువారం సందర్శించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సెస్‌ వసూలు రూ.365 లక్ష్యం కాగా రూ.388 కోట్లు వసూలైనట్లు తెలిపారు. విజయవాడ రీజియన్‌లో 83 మార్కెట్‌ యార్డులు వున్నాయని, వీటిలో 5.70 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన 580 గోదాములు ఉన్నాయని, 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల 199 గోదాములు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వీటిని నామమాత్రపు అద్దె ప్రాతిపదికన పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు రైతులకు ఇస్తామన్నారు. రైతుల నుంచి వసూలు చేసిన మార్కెట్‌ ఫీజును యార్డులో మౌలిక సదుపాయాలకు ఖర్చుపెడుతున్నామని చెప్పారు. సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో పశువుల సంత ఏర్పాటుకు స్థలాన్ని అన్వేషిస్తున్నామని, అచ్చంపేట రోడ్డులో చెక్‌పోస్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఆయనవెంట మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పి.బాబురావు తదితరులున్నారు.