Nov 06,2023 21:29

మెంటాడ : సభలో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి-మెంటాడ : మెంటాడ మండలంలో రూ.406 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు డిప్యూటీ సిఎం రాజన్నదొర తెలిపారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టి ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండలంలోని పోరాంలో ఆయన కేకు కట్‌ చేశారు. అనంతరం జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 8న సాలూరులో జరిగే వైసిపి సాధికార బస్సు యాత్రకు పోరాం నుండి బస్సులు, మోటార్‌ సైకిల్‌ ర్యాలీగా వెళ్తున్నట్లు తెలిపారు. అందుకు ఏర్పాట్లు చేయాలని ఎంపిపి రెడ్డి సన్యాసినాయుడు, జెడ్‌పిటిసి లెంక సన్యాస అప్పలనాయుడు, నాయకులు రాయపల్లి రామారావుకు సూచించారు. కార్యక్రమంలో నారాయణమూర్తి, ఎమ్మెల్సీ సురేష్‌ బాబు. వైస్‌ ఎంపిపి సారికి ఈశ్వరరావు, నాయకులు లెంక రత్నాకర్‌ నాయుడు, కనిమెరక త్రినాథ్‌, పాశల ప్రసాద్‌, దాట్ల హనుమంత రాజు, ఎంపిడిఒ త్రివిక్రమరావు, తహశీల్దార్‌ రామకృష్ణ, పి.అప్పలనాయుడు, మీసాల గురునాయుడు పాల్గొన్నారు.
ప్రజల తలరాతను మార్చిన పాదయాత్ర : ఎమ్మెల్యే
గజపతినగరం : ప్రజల తలరాతను మార్చిన పాదయాత్రకు నేటితో ఆరేళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. ఈ సందర్భంగా సోమవారం వైసిపి కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకును కట్‌ చేసి పార్టీ కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజల కష్టాలకు, అవసరాలకు అనుగుణంగా నవరత్నాలను రూపకల్పన చేసి అమలు చేశారని గుర్తు చేశారు. ఈనేపథ్యంలో ప్రజలు మరోసారి వైసిపికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల సంతోషమే లక్ష్యంగా పాలన : కోలగట్ల
విజయనగరం టౌన్‌ : ప్రజల సుఖ సంతోషాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలన కొనసాగుతోందని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు కోలగట్ల నివాసంలో వైసిపి నగర అధ్యక్షులు ఆశపు వేణు అధ్యక్షతన కేక్‌ కట్‌ చేశారు. పాదయాత్రలో సిఎం జగన్‌ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా హామీలిచ్చారని కోలగట్ల తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, లయ యాదవ్‌, ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌వివి రాజేష్‌, ఎంపిపి అప్పలనాయుడు, వైసిపి మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు కృషి
బొబ్బిలి : రాష్ట్రంలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు పని చేస్తున్నారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. పట్టణంలోని అమ్మిగారి కోనేరుగట్టు వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తున్న ఘనత సిఎం జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. గొల్లపల్లిలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసిపి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.