ప్రజాశక్తి - పరవాడ
జివిఎంసి 79వ వార్డులోనూ, అనకాపల్లి జిల్లా పరవాడ మండల పరిధిలోనూ ఉన్న దేశపాత్రునిపాలెం రెవెన్యూలో ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుంటున్నాయి. భూములు కనిపిస్తే చాలు అక్రమార్కులు తెగబడుతున్నారు. రూ.4 కోట్లు విలువజేసే భూములు పోతున్నా రెవిన్యూ అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశపాత్రునిపాలెం రెవెన్యూ పరిధిలో ఎక్కువుగా ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలుసుకుని వాటికి ఆనుకుని ఉఉన్న జిరాయితీ భూములను కొనుగోలు చేసి కొంతమంది ఈజీగా ప్రభుత్వ స్థలాలను కొట్టేస్తున్నారు. దేశపాత్రునిపాలెం జివిఎంసి పరిధి శివారులో ఉంది. అటు పట్టణానికి, ఇటు గ్రామీణ ప్రాంతానికి మధ్యలో ఉండటం వల్ల అక్కడ భూములకు విపరీతమైన గిరాకీ ఉంది. దీని వల్ల కబ్జాదారులకు ప్రభుత్వ భూములు వరంగా మారాయి. కబ్జాదారులు ముందుగా రెవిన్యూ అధికారులను ప్రసన్నం చేసుకొని దర్జాగా ప్రభుత్వ భూములను ఎంచుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దేశపాత్రునిపాలెం రెవెన్యూ సర్వే నెంబరు 340లో ఉన్న లేఅవుట్‌ను ఆనుకుని సర్వే నెంబరు 191/6, 5, 7, 8 12 సబ్ డివిజన్‌లలో ఉన్న జిరాయితీ భూములను రైతులు వద్ద కొంతమంది కొనుగోలు చేశారు. వాటిని ప్లాటులుగా విభజించారు. అక్కడకు వెళ్లేందుకు ప్రధాన రోడ్డు మార్గం కోసం సర్వే నెంబరు 191/19లో 45 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించేశారు. చదును చేసి ఏకంగా రహదారిలా మార్చారు. ప్రస్తుతం ఇక్కడ ఒక సెంటు భూమి రూ.9 లక్షలు వరకు పలకడంతో సుమారుగా రూ.4 కోట్లు ప్రభుత్వ భూమి కబ్జా అయిందని స్థానికులు చెబుతున్నారు.
ఇంతా జరుగుతున్నా ప్రభుత్వా ధికారులు చోద్యం చూస్తుండటంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప టికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి కబ్జాదారుల చేతుల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములను కాపాడాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.










