ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న కుటుంబాలపై కేంద్రం తాజాగా మళ్లీ గ్యాస్ భారం మోపింది. పెంచిన గ్యాస్ ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50 పెంచడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 8.20 లక్షల మంది వినియోగదారులపై నెలకు రూ.4 కోట్ల అదనపు భారం పడింది. ఈ ధరల ప్రకారం ఏడాది భారం రూ.48 కోట్లు ఉంటుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 14.2 కిలోల గ్యాస్ వినియోగదారులు 13,67,486 మంది ఉన్నారు. వీరిలో ప్రతి నెల బుక్ చేసుకునేవారు 8.20 లక్షల మంది ఉంటారు. ప్రస్తుత గ్యాస్ ధర రూ.1061 నుంచి రూ.1111కి పెరిగింది. విశాఖపట్నం జిల్లాలో హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్, ఐఒసి తదితర కంపెనీల గ్యాస్ కనెక్షన్లు 13.67 లక్షలున్నాయి. గ్రామీణ ప్రాంతంలో సిలిండర్ వినియోగం తక్కువ. గ్రామీణ ప్రాంతంలో మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి గ్యాస్ తీసుకుంటారు. ప్రతినెలా తీసుకొనే గ్యాస్ వినియోగదారులు 8.20 లక్షల మందిపై పెంచిన యాభై రూపాయల ప్రకారం నెలకు రూ.4 కోట్లు భారం పడుతుంది. గ్యాస్ డెలివరీ బారుకి ఇచ్చినది కాకుండా ప్రస్తుతం రూ.1061 చెల్లిస్తున్న వినియోగదారుడు ఇక నుంచి రూ.1111 చెల్లించాల్సి ఉంటుంది.
గ్యాస్ సబ్సిడీని (నగదు బదిలీ కింద) నేరుగా వినియోగదారుని ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా పెంచిన ధర ప్రకారం రాయితీ ధర పెంచి వినియోగదారునికి చెల్లించడంలేదు. వినియోగదారుని ఖాతాల్లో కేవలం రూ.3.95 మాత్రం వేసి చేతులు దులుపుకుంటోంది. పెంచుతున్న ధరలకు అనుగుణంగా రాయితీ పెంచకపోవడంతో భారమంతా వినియోగదారునిపైనే పడుతోంది. 2020 జూన్ నాటికి రూ.600 ఉన్న గ్యాస్ ధర తాజాగా రూ.1111 కి చేరింది.










