ప్రజాశక్తి -పల్నాడు జిల్లా : బిల్లులేమీ లేకుండా తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్‌కు రవాణా చేస్తున్న ప్రముఖ కంపెనీలకు చెందిన రూ.31.35 లక్షల రసాయనిక పురుగు మందులను వ్యవసాయ శాఖాధికారులు శనివారం సీజ్ చేశారు. మందులను రవాణా చేస్తున్న వాహనాన్ని నరసరావుపేట మండల పరిషత్ కార్యాలయానికి సమీపంలో అధికారులు అడ్డగించగా డ్రైవర్, క్లీనర్ వాహనాన్ని నిలిపేసి పరారయ్యారు. అనంతరం అందులోని మందులను అధికారులు తనిఖీ చేయగా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలిందని పల్నాడు జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి తెలిపారు. వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ ప్రముఖ కంపెనీలైన ఇండోఫిల్, బేయర్, పెస్టిసైడ్ ఇండియా కంపెనీలకు చెందిన పురుగు మందులను బిల్లులు లేకుండా, అనధికారికంగా తరలిస్తున్నట్లు చెప్పారు. పురుగు మందులు, ఎరువులను అక్రమంగా నిల్వ చేసినా, బిల్లులు లేకుండా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణంలోని నిల్వలను రికార్డుల్లో నమోదు చేయాలని, వివరాలు బోర్డుపై తప్పనిసరిగా రాయాలని చెప్పారు. పురుగు మందులు, ఎరువుల అమ్మకాలకు ఆయా కంపెనీలు అనుమతి పత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. నిబంధనలు పాటించకుంటే నిల్వలు సీజ్ చేస్తామని, వాటి నాణ్యత, పరిమాణాలను పరిశీలనకు శాంపిల్స్‌ను పరిశోధన శాలకు పంపిస్తామని తెలిపారు. తనిఖీల్లో ఎడిఎ రవికుమార్, నరసరావుపేట మండలం అధికారి సహాయ వ్యవసాయ సంచాలకులు పి.మస్తానమ్మ, వ్యవసాయ విస్తరణ అధికారులు బ్రహ్మయ్య, బోసు, రామిరెడ్డి, మస్తాన్, విఆర్‌ఒ పృథ్విరాజు పాల్గొన్నారు.










