- ఇక నుండి ఉచిత చెప్పుల స్టాండ్
- దుర్గగుడి పాలక మండలి సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదం
ప్రజాశక్తి-వన్‌టౌన్: మల్లిఖార్జున మహామండపం దిగువ ఖాళీస్థలంలో రూ.30 కోట్ల ఖర్చుతో అన్నదాన భవనం నిర్మించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపినట్లు పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు చెప్పారు. సోమవారం వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు వద్ద వున్న దేవస్థానం కార్యాలయంలో నూతనంగా నియమించబండిన పాలకమండలి మొదటి సమావేశం జరిగింది. అనంతరం చైర్మన్ కర్నాటి రాంబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమావేశంలో 18 అజెండాలపై చర్చించి ఆమోదం తెలిపామన్నారు. అందులో ముఖ్యంగా అన్నదాన భవనాన్ని జి ప్లస్ టూ గా నిర్మిస్తామని చెప్పారు. అలాగే కనకదుర్గా నగర్ నుంచి మహామండపం వరకూ రూ.13 కోట్లతో వ్యయంతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని తీర్మానించామన్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం దుర్గా ఘాట్ నుంచి కొండపైకి, అలాగే కొండపై నుంచి దుర్గాఘాట్ వరకూ ఉచితంగా రెండు బస్సులను నడపాలని నిర్ణయించామన్నారు. అమ్మవారికి లక్ష రూపాయలుకు పైగా విరాళం ఇచ్చిన వారి కుటుంబాలకు నెలలో ఒకసారి ఉచితంగా అంతరాలయ దర్శనం చేయిస్తామని, కొండపైన, కొండ దిగువన ఉచితంగా చెప్పులస్టాండ్ నిర్వహించాలని తీర్మానం చేసామన్నారు. ఎండాకాలం దృష్ట్యా కొండపైన, కనకదుర్గ నగర్‌లో చలువపందిళ్ల ఏర్పాటుకు తీర్మానం చేశామన్నారు. హారతుల టిక్కెట్‌పై వచ్చే యాత్రికులకు లడ్డూ ప్రసాదం అందజేస్తామన్నారు. దర్శనానంతరం బయటకు వచ్చే ప్రతి యాత్రికునికి 'సటారి' ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రతి యాత్రికుడికి కుంకుమ ప్రసాదం పొట్లం అందేలా తీర్మానం చేశామన్నారు. సమావేశంలో దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.










