ప్రజాశక్తి -సీలేరు
చింతపల్లి మండలం పెంటపాడు మీదుగా గంజాయి స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తున్న రూ.3 కోట్లు విలువైన 1700 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. కేసు వివరాలను అడిషనల్ ఎఎస్‌పిలు తుహీన్ సిన్హా, ప్రతాప్ శివ కిషోర్ చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా బోడపొదర్ పంచాయతీ జోడపుట్టు గ్రామంలో కిమిడు సీతారాం, మహారాష్ట్రకు చెందిన రవీంద్ర యాదవ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షేక్ యాదవ్ గంజాయి కొనుగోలు చేసి బలిమెల నది పై నుంచి నాటు పడవల్లో చిత్రకొండ మారుమూల అటవీ ప్రాంతానికి చేర్చారు. ధారకొండ అటవీ ప్రాంతానికి కాలినడకన తీసుకొచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన వాహనంలో కింది భాగంలో గంజాయి బస్తాలు ఉంచి పైన బియ్యం బస్తాలు పేర్చి ఎవరికీ అనుమానం కలగకుండా ప్రణాళిక రూపొందించారు. ఆ సమాచారం పోలీసులకు అందడంతో పెంటపాడు వద్ద పట్టుకున్నారు. నిందితుల నుంచి గంజాయితో పాటు బైకు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఆరుగురు తప్పించుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు వెల్లడించారు. సమావేశంలో చింతపల్లి సిఐ రమేష్, ఎస్‌ఐ అరుణ్ కిరణ్ పాల్గొన్నారు.










