ప్రజాశక్తి - తాళ్లరేవు మండలంలోని రామన్నపాలెం సాయి లక్ష్మీ సమాఖ్యకు చెందిన రూ.27.46 విఒఎ సంగాడి అరుణ స్వాహా చేసినట్టు సంఘం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వారు 22 సంఘాలకు చెందిన మహిళా ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గ్రామ సంఘంలోని 22 సంఘాలకు చెందిన పొదుపు, స్త్రీ నిధి డబ్బులను సంగాడి అరుణ తన బంధువులు, ఇతరుల ఖాతాలకు జమ చేసిందని తెలిపారు. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన వెలుగు అధికారులు గ్రామంలోకి వచ్చి రికార్డులు పరిశీలించారని అన్నారు. అప్పటి నుండి స్వాహా చేసిన నిధుల కోసం సంగాడి అరుణను అనేకమార్లు అడుగుతున్నప్పటికీ ఆ డబ్బులు తిరిగి జమ చేయలేదని అన్నారు. రామన్నపాలెం గ్రామంలో ఉన్న అరుణ కుటుంబ సభ్యులతో సహా గ్రామం విడిచి వెళ్లిపోయారని తెలిపారు. దీనివల్ల తమ సంఘాలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయడం లేదన్నారు. అందువల్ల సంఘాలు తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. 9 నెలలు గడిచిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. రామన్నపాలెం వచ్చిన ఎంఎల్‌ఎ సతీష్ కుమార్‌కు మహిళలు తమ సమస్యను వివరించారు. ఈ నెల 21 తరువాత దీనిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.