Sep 16,2022 23:26

మల్కాపురంలో ధర్నా పోస్టర్లను ఆవిష్కరిస్తున్న సిఐటియు నేతలు

అసెంబ్లీ సమావేశాల్లోనే జిఒ జారీ చేయాలని డిమాండ్‌
ప్రజాశక్తి - పిఎంపాలెం :
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే కార్మికుల కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని మధురవాడ జోన్‌ సిఐటియు నేతలు కోరారు. ఈ మేరకు శుక్రవారం మధురవాడలో సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, మధురవాడ జోన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.రాజ్‌కుమార్‌, డి. అప్పలరాజు, విజరు, పైడిరాజు చిన్నా తదితరులు సంబంధిత పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుమార్‌ మాట్లాడుతూ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతిఐదేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉన్నప్పటికీ, టిడిపి, వైసిపి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నేటికీ రూ.10వేలు నుంచి రూ.12వేల నెలసరి వేతనానికే కార్మికుల పనిచేయాల్సి వస్తోందన్నారు.తక్షణమే కనీస వేతన సలహా మండలిని నియమించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరిగిన ధరలు కనుగొనంగా కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని ఈనెల 20న అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపడుతున్నట్లు వెల్లడించారు. విశాఖ జిల్లాలో సరస్వతీ పార్క్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు నిర్వహించే ప్రదర్శన, ధర్నాలో కార్మికులుఅధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ములగాడ :కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అందించాలన్న డిమాండ్‌తో ఈ నెల 20న కలెక్టరేట్‌ వద్ద చేసేధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని మల్కాపురం జోన్‌ సిఐటియు నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థాని సిఐటియు కార్యాలయం వద్ద దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సిఐటియు మల్కాపురం జోన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ పోరాటం ద్వారానే హక్కులను సాధించుకోవాలని, అలాగే వేతన సమస్య పరిష్కారానికి అందరూ సంఘటితమై ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జోన్‌ అద్యక్షులు కె.పెంటారావు జోన్‌ నాయుకులు టి.అప్పారావు ,వి.నీలయ్య జనార్థనరావు పాల్గొన్నారు.