
ప్రజాశక్తి - గుంటూరు సిటి : జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన రూ.26.50 లక్షల విలువచేసే 106 బ్రాండెడ్ మొబైల్ ఫోన్లను పోలీసులు రోజుల వ్యవధిలోనే రికవరీ చేశారు. వీటిని బాధితులకు గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ సుప్రజ శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అందజేశారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి కోసం 8688831574 అనే వాట్సాప్ నంబర్‌ను పోలీసులు ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఈనెంబర్‌కు వాట్సాప్ ద్వారా హారు అని మెసేజ్ చేస్తే ఓ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అందులో ఫోనుకు సంబంధించిన వివరాలు పొందుపరిచి సెండ్ చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు లేకుండానే చోరీకి గురైన మొబైల్ ఫోన్లను జిల్లా ఐటీ కోర్ పోలీసులు రికవరీ చేస్తున్నారు. దీనిపై ఎఎస్‌పి సుప్రజ మాట్లాడుతూ మొబైల్ పోయిన వెంటనే సెయిర్ సిటిజెన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే ఫోన్‌లోని సమాచారం దుర్వినియోగం కాకుండా ఫోన్ బ్లాక్ అవుతుందని, ఫోన్‌ని ట్రాక్ చేసి రికవరీ చేయడం సులువుతుందని అన్నారు. జిల్లా ప్రజలే కాక ఇతర జిల్లాలు చెందిన వారు కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చని అన్నారు. ఎక్కువగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబై, ఢిల్లీలో ఈ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం పోయిన రూ.40 వేల ఫోన్‌ను తాను తిరిగి పొందడం సంతోషంగా ఉందని బాధితుడు ఉమామహే శ్వరరావు చెపాపరు. తాను పోగొట్టుకున్న ఫోన్‌ను 48 గంటల్లోనే ఇచ్చారని గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)లో పనిచేసే డాక్టర్ సుష్మ ఆనందం వ్యక్తం చేశారు.