Aug 12,2022 00:28

అనకాపల్లిలో భారీ మానవహారం చేపట్టిన విఆర్‌ఎలు

గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని, రూ.26 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం విశాఖ, అనకాపల్లి జిల్లాల కలెక్టరేట్ల వద్ద విఆర్‌ఎలు భారీ ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రజాశక్తి - అనకాపల్లి : తమ సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామ రెవెన్యూ సహాయకులు అనకాపల్లి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద తొలుత ధర్నా చేపట్టారు. నెహ్రూచౌక్‌ జంక్షన్‌లో మానవహారం, అక్కడ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ బ్రిటీష్‌ కాలం నుంచి గ్రామాల్లో రెవెన్యూ సహాయకులు విశేష సేవలందిస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారని చెప్పారు. అటువంటి వారికి కనీస వేతనాలు ఇవ్వకపోవడంతో దుర్భర జీవితం అనుభవిస్తున్నారన్నారు. వీరికి ఉద్యోగోన్నతులు కల్పించలేదని, అనేక మంది నామినీ విఆర్‌ఎలుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను మార్గమధ్యంలో కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో 24 మండలాల నుంచి విఆర్‌ఎలు, సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్‌, లోవరాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శాంతకుమారి, సంతోష్‌ కుమార్‌ సింహాచలం, పరదేశి నాయుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని, రూ.26 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు విఆర్‌ఎలు పాదయాత్ర చేపట్టారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం గౌరవాధ్యక్షుడు పి.వెంకటరావు, కన్వీనర్‌ ఎ.సత్యం మాట్లాడుతూ విఆర్‌ఎలకు డిఎ రికవరీ జీవోను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. రికవరీ చేసిన డిఎను విఆర్‌ఎల ఖాతాలో జమ చేయాలన్నారు. నామినీలుగా పని చేస్తున్న వారిని విఆర్‌ఎలుగా నియమించాలన్నారు. కలెక్టర్‌ ఆఫీస్‌, ఆర్‌డిఒ, మండల కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అటెండర్‌, నైట్‌ వాచ్‌మ్యాన్‌ పోస్టులను గ్రామ రెవెన్యూ సహాయకులతో భర్తీ చేయాలన్నారు. అర్హతగల విఆర్‌ఎలకు విఆర్‌ఒ పోస్టులలో ప్రమోషన్లు కల్పించాలన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధంగా విఆర్‌ఎల చేత అక్రమ డ్యూటీలు చేయించరాదన్నారు. కార్యక్రమంలో అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌కు వినతిపత్రం సమర్పించారు.