ప్రజాశక్తి -పాడేరు: ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాలకు రూ.25 లక్షల నిధులు విడుదల చేసామని ఐటిడిఏ పిఓ రోణంకి క్రిష్ణ పేర్కొన్నారు. మరో రూ.25 లక్షల నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఐటిడిఏ కార్యాలయం నుండి 11 మండలాల ఇంజనీరింగ్ అధికారులు, ఎంపిడిఓలు, ఎటిడబ్ల్యూలు, ఎం.ఇ.ఓలు, సిడిపిఓలు, ఉపాధిహామీ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ సచివాలయం భవనాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీలో లేబర్ మొబలైజేషన్ పెంచాలన్నారు. ప్రతీ రోజు మండలంలో ఐదువేల మందికి పని కల్పించాలని ఎంపిడిఓలను ఆదేశించారు. ఉపాధి హామీ అధికారులు ఉదయమే క్షేత్ర పర్యటనలు చేసి పనులు పర్యవేక్షించాలన్నారు. మనబడి నాడు నేడు, ఆసుపత్రులలో నాడు నేడు, మిషన్ అమృత్ సరోవర్లో చెరువులు అభివృద్ధి, జగనన్న స్వఛ్ఛ సంకల్పం, ఉపాధి హామీ పనులు, స్వాతంత్య్ర సమర యోధుల మ్యూజియం పనులు, గుల్లేలు నుండి కొండ్రుం రోడ్డు నిర్మాణపు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అంగన్వాడీ భవన నిర్మాణాలు, నాడు నేడు పనుల వ్యయాలను ఆన్ లైన్లో త్వరత్వరగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నాడు నేడు పనులు జాప్యం చేయకుండా అన్ని రకాల పనులు పూర్తి చేయాలని రహదారులు భవనాల ఇంజనీర్లకు సూచించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ, ఇఇ డివిఆర్‌ఎం రాజు, పంచాయతీ ఇఇ కొండయ్య పడాల్, పిఐయు ఇఇ కె.లావణ్య కుమార్, రహదారులు భవనాల శాఖ ఇఇ బాల సుందర బాబు, డిఎల్‌పిఓ పిఎస్ కుమార్, ఉపాధి హామీ ఎపిడి జె. గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.










