
ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు
ప్రజాశక్తి - మొగల్తూరు
వారతిప్ప గ్రామాన్ని రూ.2.39 కోట్లతో అభివృద్ధి చేశామని చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం మండలంలో జరిగిన రెండో విడత గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వారతిప్పలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మొదటి విడత గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరైన రూ.5 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. మండల పరిషత్ నిధులు రూ.2 లక్షలతో ఫిల్టర్ బెడ్స్ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపిపి స్కూల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందుతుందా లేదా అని ఆరా తీశారు. అనంతరం రూ.23 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. వారతిప్ప గ్రామానికి రూ.2.39 లక్షలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను స్వాగతిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎంసి ఛైర్మన్ గుబ్బల రాధాకృష్ణ, జెడ్‌పిటిసి తిరుమాని బాపూజీ, వైస్ ఎంపిపి కైలు సుబ్బారావు, ఎంపిటిసి తిరుమాని నాగరాజు వరలక్ష్మి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బంధన పూర్ణ చంద్రరావు పాల్గొన్నారు.