
పుట్టపర్తి అర్బన్ : జగనన్న విద్య దీవెన ద్వారా జిల్లాలో విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.23.79 కోట్లు జమ అయ్యిందని కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు మున్సిపల్ ఛైర్మన్ తుంగ ఓబుళపతి, పుడా ఛైర్‌పర్సన్ లక్ష్మీనరసమ్మ, అగ్రి బోర్డు ఛైర్మన్ ఎటి.రమణారెడ్డి, సాంఘిక సంక్షేమ అధికారి శివ రంగ ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మల జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగ వ్యవస్థలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు అమలు చేస్తూ పేద విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నారని ప్రతి విద్యార్థి కష్టపడి ఇష్టపడి బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 35044 మంది విద్యార్థులకు సంబంధించి 32,004 మంది తల్లుల ఖాతాలో నేరుగా 23,79,32,337 రూపాయలు అందుతుందన్నారు. అనంతరం కలెక్టర్ అధికారులు మెగా చెక్కును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్ రామ్, వసతి గహాల సంక్షేమ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.