Sep 24,2023 21:49

సమావేశంలో మాట్లాడుతున్న డిసిఎంఎస్‌ చైర్‌పర్సన్‌ భావన

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   ఉమ్మడి విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 20కోట్ల 68 లక్షల రూపాయల వ్యాపారం నిర్వహించి రూ.26.24లక్షల నికర లాభాన్ని ఆర్జించామని డిసిఎంఎస్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ అవనాపు భావన తెలిపారు. ఆదివారం ఆమె అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బావన మాట్లాడుతూ రాష్ట్రంలో 20 కోట్ల రూపాయల పైగా వ్యాపారం నిర్వహించే డిసిఎంఎస్‌లు అయిదు ఉండగా, అందులో విజయనగరం కూడా ఉండడం సంతోషకరమని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, డిసిఎంఎస్‌ డైరెక్టర్లు, పిఎసిఎస్‌ పాలకవర్గాల సహాయ సహకారాలతో డిసిఎంఎస్‌ను లాభాల బాటలో నడప గలుగుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు వ్యాపారాన్ని మరింత పెంచేందుకు సభ్యుల సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. గతంలో నిలిచిపోయిన విత్తనాలు, ఎరువుల అమ్మకాలను పునరుద్ధరించి రైతులకు సరసమైన ధరకే విక్రయిస్తున్నామని తెలిపారు. మార్కెట్‌ ధర కంటే తక్కువగా విద్యార్థులకు లేపాక్షి బ్రాండ్‌ నోటు పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. డిసిఎంఎస్‌ ప్రాంగణంలో జనరిక్‌ మెడికల్‌ షాపు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. మరింత అభివృద్ధి బాటలో డిసిఎంఎస్‌ ను నడిపేందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి టి.రామారావు , సహకార శాఖ అధికారి అప్పలనాయుడు , మార్క్‌ ఫెడ్‌ డిఎం విమల, డిసిఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌ బివిఎస్‌ సాయికుమార్‌, డైరెక్టర్లు పి.రామకృష్ణ, పి.నారాయణమూర్తి , వి.శ్రీరాములునాయుడు, ఎస్‌. సన్యాసినాయుడు, బి.బంగారు నాయుడు, ఎం.శ్రీకాంత్‌ , సహకార సంఘాల ప్రతినిధులు, డిసిఎంఎస్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.