ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : దేశంలో రూ.2 వేల నోటును చలామణిలో ఉంచరాదని ఆర్‌బిఐ శుక్రవారం తీసుకున్న నిర్ణయంపై ఉమ్మడి జిల్లా ప్రజల్లో కలకలం బయలుదేరింది. ప్రజల వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఈనెల 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకుల్లో సమర్పించి ఇతర కరెన్సీని తీసుకోవచ్చునని ఆర్‌బిఐ ప్రకటించింది. ఈ నోట్లు పేద, మధ్యతరగతి ప్రజల వద్ద ఎక్కువగా ఉండే అవకాశం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. అధిక సంఖ్యలో రూ.2 వేల నోట్లు కలిగి ఉన్న వారిలో ఎగువ మధ్య తరగతి, అత్యంత ధనికులు ఎక్కువగా ఉంటారని అంచనా వేస్తున్నారు.
2016 నవంబరు 8న నోట్ల రద్దు వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎగువ మధ్య తరగతి, కోటిశ్వర్లు సునాయసనంగా పాత నోట్లను ఇచ్చి కొత్త నోట్లు పొందగలిగారు. పేద వారు మాత్రమే బ్యాంకుల ఎదుట క్యూలైన్లలో నిలబడి కష్టాలు పడ్డారు. రూ.500, రూ,1000 నోట్ల రద్దు తరువాత రూ.2 వేల నోట్లను ఆర్‌బిఐ 2016 నవంబరు 10వతేదీ నుంచి సర్కులేషన్‌లోకి తీసుకువచ్చింది. గతేడాదిన్నరగా వీటి సర్కులేషన్‌ను కూడా ఆర్‌బిఐ తగ్గించింది. అయినా బడాబాబుల వద్ద ఉన్న రూ.2వేల నోట్లు బయటకు రావడంలేదు అవసరమైనప్పుడు మాత్రమే వారు బయటకు తీస్తున్నారు. ప్రధానంగా వ్యాపారులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లే సమయంలో రూ.2వేల నోట్లను ఎక్కువగా తీసుకువెళ్తున్నారు. ప్రధానంగా బంగారం, వెండి, ఇతర ముడిసరుకులు, వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి దారులకు వాణిజ్యపరమైన వస్తువులు ఒక చోట నుంచి మరొక చోట విక్రయం, ఎగుమతి దారులకు ఈ నోట్ల ద్వారా చలామణి తేలికగా ఉంటోందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే బడాబాబులు కొందరు వీటిని బ్లాక్ చేసి తమ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవాలన్న లక్ష్యంగా దాచుకున్న వారికి ఇప్పుడు ఇబ్బందులు తప్పేలా లేవు.
సామాన్యులు, మధ్య తరగతి వారి వద్ద రూ.లక్ష, రెండు లక్షల్లో ఉన్నా ఐదునుంచి 10 సార్లు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రజల వద్ద రెండు వేల నోట్లు వుంటే తప్పనిసరిగా బ్యాంకులు మాత్రమే వెళ్లాల్సి వుంటుంది తప్ప ఒకరినుంచి మరొకొరికి చలామణి అయ్యే అవకాశాలు ఉండవని చెబుతున్నారు. జిల్లాలో కొంతమంది బడా వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు, కాంట్రాక్టర్లు వద్ద రూ.2వేల నోట్లు పెద్ద సంఖ్యలో ఉంటాయని బ్యాంకర్లు భావిస్తున్నారు. వాటిని రోజు 10 నోట్ల చొప్పునమార్పిడి చేస్తారా? లేక 2016లో మాదిరిగా ఇతర మార్గాలను ఎంచుకుంటారా అనేది అంశంచర్చనీయాంశంగా మారింది.
నల్లధనం బయటకు తేలేకపోయారు
పాశం రామారావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి.
దేశంలో నల్లధనం బయటకు తెచ్చి పేదలకు ఒక్కొక్కరికి ఖాతాలో రూ.15 లక్షలు ఇస్తామని నరేంద్ర మోడీ చెప్పారని ఇప్పటివరకు పేదలకు ఒక్క రూపాయికూడా జమచేయలేదు. 2016లో పెద్ద నోట్లరద్దు వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు కష్టాలు, బడాబాబులకు నల్లధనంను తెల్లధనంగా మార్చుకునేందుకు అవకాశం కలిగింది. 2016 నుంచి ఇప్పటి వరకు ఎంత నల్లధనం బయటకు తీశారు.పేదలకు ఎంత జమచేశారో చెప్పాలి. రూ.2 వేల నోట్ల రద్దు వల్ల బడాబాబులకు ఉపయోగం.
తుగ్లక్ చర్య
గుంటూరు విజయకుమార్, సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి.
నోట్ల రద్దు వల్ల సామాన్యులకు ఇబ్బందులు, బడాబాబులకు ప్రయోజనం కలుగుతుంది.నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చును ప్రజలపైనే భారం మోపుతారు. రూ.500, వెయ్యి ఎందుకు రద్దుచేశారో.. రూ.2వేలు ఎందుకు ప్రవేశపెట్టారో..మళ్లీ ఎందుకు రద్దు చేస్తున్నారో తెలియడంలేదు. ఇది ఒక తుగ్లక్ చర్య. 2016 నుంచి ఇప్పటి వరకు వెలికితీసిన నల్ల ధనం ఎంత పేదలకు ఓరిగిన ప్రయోజనం ఎంతో కేంద్రప్రభుత్వం చెప్పాలి.
ప్రయోజనం శూన్యం
ఆతుకూరి ఆంజనేయులు, గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు
రూ.2వేల నోట్లు రద్దు వల్ల ప్రయోజనం శూన్యమని ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనం ఏమిటన్నదీ తెలియడం లేదు. చిన్నవ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు తమ వద్ద ఓట్లను మార్చుకునేందుకు బ్యాంకుల వద్దకు వెళ్లాల్సి వస్తుందే తప్ప 2016లో జరిగిన నోట్ల రద్దు వల్ల వచ్చిన ప్రయోజనం ఎంతో ఇప్పుడే అంతే వస్తుంది. రూ.2 వేల నోట్లు ఎందుకు ప్రవేశపెట్టారో...ఇప్పుడు ఎందుకు రద్దు చేస్తున్నారో తెలియడం లేదు. 2016లో నోట్ల రద్దు వల్ల ఏమైనా బ్లాక్ మనీ బయటకు వచ్చిందా?.
కార్పొరేట్ శక్తులకు మేలు
మస్తాన్‌వలి, పిసిసి వర్కింగ్ ప్రసిడెంట్.
రూ.2 వేల నోట్లు రద్దు వల్ల బిజెపికి మద్దతిస్తున్న కార్పొరేట్ శక్తులకు మేలు జరుగుతుంది. బిజెపి మినహా ఇతర రాజకీయ పార్టీలను ఆర్థికంగా దెబ్బతీయడం కోసం మోడి తరచూ ఇలాంటి ఎత్తుగడలు వేస్తుంటారు. ఇప్పుడు కూడా అంబాని,ఆదాని వంటి బడా కార్పొరేట్ సంస్థల వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు రూ.2 వేల నోట్ల రద్దు ఉపయోగపడుతుంది. మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే.










