Oct 24,2023 22:07

సర్వసభ్య సమావేశంలో ఎంపిపి వెంకటరామరాజు
ప్రజాశక్తి - గణపవరం

          మండలంలోని లే అవుట్‌లో రెండు కోట్లతో ఇంటర్నల్‌ రహదారులు నిర్మిస్తున్నట్లు ఎంపిపి దండు వెంకటరామరాజు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ భవనంలో మంగళవారం నిర్వహించిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల అభివృద్ధికి నిధులు కేటాయించి డ్రెయినేజీలు, రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖాధికారి వై.ప్రసాద్‌ మాట్లాడుతూ మండలంలో ఇ క్రాప్‌ వంద శాతం పూర్తి చేశామన్నారు. నవంబర్‌ ఒకటో తేదీ నుంచి వరి కోతలు ప్రారంభమవుతాయని తెలిపారు. శాంపిల్స్‌ ఇచ్చిన రైతులకు సంచులు అందిస్తామన్నారు. సెలవు రోజున సమావేశాలు ఏర్పాటు చేయడం తగదన్నారు. ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి మాట్లాడుతూ సమావేశం ఏర్పాటు చేసి 90 రోజులు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం 18 కులవృత్తులను గుర్తించి వారికి పిఎం విశ్వకర్మ పథకంలో బ్యాంకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సర్పంచులు గ్రామాల్లో ఉన్న కుల వృత్తుల చేసుకునే వారు దరఖాస్తులు చేసుకునేలా ప్రోత్స హించాలన్నారు. బ్యాంకుకు ఎటువంటి ష్యూరిటీ లేకుండా రూ.2 లక్షల వరకు రుణాలు అందిస్తుందని చెప్పారు. తొలుత ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం సందర్భంగా అమృత్‌ కలెక్షన్‌ యాత్ర ర్యాలీ నిర్వహించారు. 25 గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టి ధాన్యం కలిసి ఉన్న కలశంతో ర్యాలీగా వెళ్లి స్వతంత్ర సమరయోధులు స్థూపం వద్ద ప్రతిజ్ఞ చేశారు. కలశాలను ఢిల్లీ పంపిస్తున్నట్లు ఎంపిడిఒ జ్యోతిర్మయి తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ జెఇ కె.హరినాధ్‌రాజు, పంచాయతీరాజ్‌ జెఇ శ్రీనివాసరావు, సూర్యబలిజ రాష్ట్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శెట్టి అనంతలక్షి, జెడ్‌పిటిసి సభ్యులు దేవవరపు సోమలక్షి, సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షురాలు చనుమూరి లక్ష్మీభవాని, వైస్‌ ఎంపిపి సలాది రత్నదుర్గాకుమారి, నెహ్రూ యువకేంద్రం కో-ఆర్డినేటర్‌ పి.వెంకటలక్ష్మి, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.