ప్రజాశక్తి - వినుకొండ : వినుకొండ జిడిసిసి బ్యాంకులో గతేడాది రుణ మంజూరులో జరిగిన అవకతవకలపై పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశాల మేరకు గురువారం డివిజన్ కోపరేటివ్ సొసైటీ అధికారి జెపిడి తాండన్ విచారణ చేపట్టారు. బొల్లాపల్లి మండలం సరికొండపాలెం డ్వాక్రా సంఘాలకు వినుకొండ జీడీసీసీలో ఖాతా లేకుండా వారికి తెలియకుండానే ఒక్కొక్క సంఘానికి రూ.10 లక్షలు రుణమిచ్చినట్లు చూపి 12 గ్రూపులకు, సరికొండపాలెం తండాలో మరో 13 డ్వాక్రా గ్రూపులకు ఒక్కొక్క సంఘానికి రూ.3 నుండి రూ.5 లక్షల వరకు డ్వాక్రా సంఘాల పేరుతో సంతకాలు ఫోర్జరీ చేసి సెల్ఫ్ చెక్కులు పుట్టించి రూ.2 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. అప్పటి మేనేజర్ వెన్నపూస రమేష్‌బాబురెడ్డి, బ్యాంకులో పనిచేసే ప్రైవేట్ వ్యక్తి భాస్కరనేని నరసింహమూర్తి, మరికొందరు కలిసి జిడిసిసి బ్యాంకులో గతేడాది జూన్ 13న రూ.రెండు కోట్లు స్వాహా చేశారు. దీనిపై గతంలో బ్యాంకు, జిడిసిసి డిపార్ట్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నేడు విచారణ చేపట్టినట్లు విచారణ అధికారి తాండన్ తెలిపారు.
ఇదిలా ఉండగా విచారణకు సరికొండపాలెంలోని బాధిత డ్వాక్రా సంఘాల మహిళలు సుమారు 100 మందికిపైగా హాజరయ్యారు. విచారణాధికారి సరిగా విచారణ చేయకుండానే తమతో సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. విచారణ స్టేట్‌మెంట్ ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదన్నారు. గతంలోనూ ఇలా రెండుసార్లు చేశారని, ఈ విచారణపైనా తమకు నమ్మకం లేదని అన్నారు. తమకు 20 ఏళ్లగా వెల్లటూరు కెనరా బ్యాంకులో ఖాతాలున్నాయని, జిడిసిసి బ్యాంకు మొహం కూడా తెలియని చెప్పారు. అయినా ఒక్కొక్క గ్రూపు పేరుతో రూ.10 లక్షలు రుణం తీసుకున్నట్టు మాకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. తమకు ఇతర బ్యాంకుల్లోనూ రుణాలూ ఇవ్వడం లేదని తారకరామా, సాయిరాం, జనని, ప్రియాంక, ధనలక్ష్మి, జస్వంత్, ఆరాధ్య, శాంతి తదితర డ్వాక్రా సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. జిడిసిసిబిలో తమకు రుణాలు లేవనే ధ్రువపత్రాలు ఇస్తేనే విచారణకు సహకరించి సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో విచారణ అధికారితో వాగ్వాదం తలెత్తింది. విచారణ నివేదిక పత్రం ఇవ్వకుంటే కలెక్టరేట్ వద్దే ఆందోళన చేస్తామని చెప్పారు. విచారణ అధికారి టాండన్ మాట్లాడుతూ విచారణ నివేదిక పత్రాలు బాధితులకు ఇవ్వటం కుదరదు అన్నారు. సరికొండపాలెం డ్వాక్రా సంఘాలకు బ్యాంకులో రుణాలు లేవని, సంతకాల ఫోర్జరీతో రూ.కోట్లు కాజేసారని చెప్పారు. విచారణకు బాధితులు సహకరిస్తేనే తాము విచారణ పూర్తి చేసి కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు.










