ప్రజాశక్తి-పాడేరు : వైఎస్ ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా కింద జిల్లాలో 193 మంది లబ్దిదారులకు రూ.1కోటి 91 లక్షల 35 వేలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు.. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌తో పాటు పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మిలు సిఎం ప్రారంభించిన ఎస్ ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా ప్రత్యక్ష ప్రసారాన్ని శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అరకు నియోజక వర్గంలో 81 మంది లబ్దిదారులకు, పాడేరు నియోజక వర్గంలో 48 మంది, రంప చోడవరం నియోజక వర్గంలో 64 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జిల్లాలో వెనుకబడిన వర్గాలు 16 మంది, దివ్యాంగులు ఇద్దరు, ఎస్సీలు 16 మంది, షెడ్యూల్డు తెగలు 159 మందికి ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు.
పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, పేద కుటుంబాల చెల్లమ్మల వివాహాలకు వై ఎస్ ఆర్ కళ్యాణ మస్తు, వై ఎస్ ఆర్ షాదీ తోఫా ఆర్ధిక అండగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. షెడ్యూల్డు తెగలు, షెడ్యూల్డు కులాల వివాహాలకు రూ.1లక్ష, కులాంతర వివాహాలకు రూ.1.20 వేలు, వెనుకబడిన వర్గాలకు రూ.50 వేలు, కులాంతర వివాహాలకు రూ. 75 వేలు, మైనార్టీలకు రూ.1 లక్ష, దివ్యాంగులకు రూ.1.50వేలను ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. అనంతరం లబ్దిదారులకు నమూన చెక్కును అంద జేసారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు జె.సుభద్ర లబ్దిదారులతో మాట్లాడుతూ. ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. లబ్దిదారుల స్పందనను అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో జిసిసి చైర్మన్ శోభ స్వాతి రాణి, డిఆర్‌డిఏ పిడి వి.మురళి, పలువురు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.










