Dec 15,2022 00:13

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

ప్రజాశక్తి -సీలేరు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులు రూ.155 కోట్లతో మారుమూల గ్రామాల్లో తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం మండలంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్‌ స్థానిక విలేకర్లతో మాట్లాడారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు 1200 వర్కులు మంజూరయ్యాయని, వీటిని ఆరు నుంచి 8 నెలలోపు 70 శాతం పనులు పూర్తి చేస్తే మారుమూల ప్రాంతాల్లో మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లాలో డిజిటల్‌ మొబైల్‌ కనెక్ట్‌విటీ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే జిల్లాలో 1200 నుంచి 1500 వరకు మొబైల్‌ టవర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందులో 150 టవర్లు ఇన్సులేషన్‌ పేజీలో ఉన్నాయని, ప్రతి నెలకు 50 టవర్లు చొప్పున సిగల్స్‌ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మారుమూల ప్రాంతాలైన దారకొండ, గాలికొండ, రాంగూడ, బలపం, అనంతగిరి తదితర ప్రాంతాల్లో 1000 మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేయడానికి చర్యలు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 46 పిహెచ్‌లు ఉన్నాయని, ప్రతి పిహెచ్‌సికి ఇద్దరు వైద్యాధికారులు ఉంటే వైద్య సేవలు మరింత మెరుగ్గా అందుతాయని తెలిపారు. జిల్లాలో 40 నుంచి 45 మంది వైద్యులను నియమిస్తామని చెప్పారు. 150 నుంచి 400 వరకు అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. గంజాయి సాగును వదులుకున్న వారికి కాఫీ, మిరియాలు, వరి, కూరగాయలు పండించుకోవటానికి ప్రభుత్వ పరంగా మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంతాలకు అనువైన సిల్వర్‌ ఓక్‌ నర్సరీలను చింతపల్లిలో ఏర్పాటు చేశామన్నారు. జీడిమామిడి మొక్కలను కూడా సీజన్లో సరఫరా చేసి ఆదుకోవడం జరుగుతుందన్నారు.
వైద్య శిబిరం, వాలీబాల్‌ టోర్నమెంట్‌
జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ మాదిగమల్లు గ్రామంలో జిల్లా ఎస్‌పి సతీష్‌ కుమార్‌ ఆదేశాల మేరకు చింతపల్లి ఏఎస్పీ శివ కిషోర్‌, రంపచోడవరం ఎఎస్‌పి రానా, జీకే వీధి సీఐ అశోక్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం సంజీవని మెగా వైద్య శిబిరం, మెగా వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో మెడికవర్‌, అమృత ద్రుయ ట్రస్ట్‌ కోన ప్రకాష్‌, డాక్టర్‌ చలపతి, దుష్ట ఐ హాస్పిటల్‌, దారకొండ మెడికల్‌ ఆఫీసర్స్‌ హిమబిందు నాగభూషణం ఆధ్వర్యంలో 1200 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 80 మందికి అత్యవసర వైద్యశాల నిమిత్తం రిఫర్‌ చేశారు. వాలీబాల్‌ పోటీల్లో మండలంలోని గిరిజన గ్రామాల నుంచి 82 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ప్రథమ బహుమతి రూ.25వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10వేలు చొప్పున అందజేయనున్నారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతి జట్టుకు ఉచితంగా వాలీబాల్‌ కిట్లు పంపిణీ చేస్తారు. ముందుగా క్రీడాకారులని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పరిచయం చేసుకున్నారు. క్రీడాస్ఫూర్తితో రాణించాలని సూచించారు. అనంతరం క్రీడాకారులు, 2000 మంది ప్రజలకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ పార్టీ డిఎస్పి వెంకట్రావు, ఎస్సైలు అప్పల రాము, రామకృష్ణ, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.