Oct 01,2022 22:58

మాట్లాడుతున్న డ్వామా పీడీ రమేష్‌రామన్‌

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
2023- 2024 ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలోని 22 మండలాల్లో రూ.1.50 కోట్లతో ఉపాధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా నీటి యాజమాన్యం సంస్థ (డ్వామా) ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌.రమేష్‌ రామన్‌ పేర్కొన్నారు. శనివారం రంపచోడవరరం ఐటీడీఏ సమావేశ మందిరంలో 11 మండలాలకు సంబంధించిన ఉపాధి హామీ ఏపీడీలు, ఏపీవోలు, డిబిటి మేనేజర్లు, జేఈలు, ఈసీలు, టిఏలు, బిఎఫ్‌టిలు, కంప్యూటర్‌ ఆపరేటర్లతో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌ రామన్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో భాగంగా రోడ్లు, చెరువులు, చెక్‌ డ్యామ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తద్వారా గిరిజన రైతులకు సాగునీరు ఏర్పాటు, భూమి అభివృద్ధి పనులు, పండ్ల తోటలు పెంపకం, గిరిజనులకు జీవన ఉపాధి కల్పించడం తదితర అభివృద్ధి పనులు గుర్తించేందుకు టీమ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఏజెన్సీలోని ప్రతి కుటుంబానికీ వంద రోజులు ఉపాధి పనులు కల్పించడం జరుగుతుందన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు పొందిన రైతులకు 150 రోజులు పని దినాలు కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. ఏజెన్సీలోని రబ్బరు తోటలు అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులకు మండలాల వారిగా టీములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టీములు గ్రామాల్లో పర్యటించి గిరిజనులతో సంప్రదించి ఎంపిక చేసిన పనులకు గ్రామ సభల ద్వారా తీర్మానం తీసుకొని నివేదికలు అప్‌లోడ్‌ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంజూరైన పనులన్నీ వేగవంతంగా పూర్తి చేసి ఆయా బిల్లులు కూడా ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఇక్కడ తీసుకున్న శిక్షణలో పూర్తిగా అవగాహన చేసుకుని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలతో సంప్రదించి పనులు గుర్తించాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీడీలు కె.చిట్టిబాబు, రోశయ్య, పవన్‌ కుమార్‌, డిబిటి మేనేజర్‌ రాజా నరేష్‌, ఏపీవోలు సాయిబాబా, సురేష్‌, ప్రకాష్‌, అరవాలు తదితరులు పాల్గొన్నారు.