
ప్రజాశక్తి- మెరకముడిదాం : భైరిపురంలో త్వరలో రూ.1.38 కోట్లతో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నట్లు జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం గ్రామంలో సుమారు కోటి రూపాయలతో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం గడప గడప కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చి నిలబెట్టుకొనే ప్రభుత్వమని, గత ప్రభుత్వం మాదిరిగా ఉచిత హామీలు ఇచ్చి ఎగ్గొట్టే ప్రభుత్వం కాదని అన్నారు. గ్రామంలో అర్హులందరికీ ఇప్పటివరకు సుమారు 18కోట్ల రూపాయలు వేసిందని తెలిపారు. నాడు -నేడు పథకం ద్వారా సుమారు కోటి రూపాయలతో పాఠశాల భవన నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రతి పక్ష నాయకుడు చంద్ర బాబునాయుడు బెయిల్‌పై కొన్ని రోజులు బయటకు వస్తే టిడిపి నాయకులు ఆర్భాటం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.
కార్యక్రమంలో ఎంపిపి తాడ్డి కృష్ణవేణి, తాడ్డి వేణుగోపాలరావు, మండల వైసిపి పార్టీ అధ్యక్షులు కోట్ల వెంకటరావు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్ వి రమణరాజు, వైస్ ఎంపిపిలు టి. హరిబాబు, కందుల పార్వతి, కెఎస్‌పి ప్రసాద్, తాడ్డి చంద్రశేఖర్, సత్తారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.