
ప్రజాశక్తి- విశాఖపట్నం : విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులతో కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకం క్రింద జిల్లాలో 5,942 మంది రజక, 1,521 మంది నాయిబ్రాహ్మణులు, 5,862 మంది దర్జీ లబ్ధిదారులకు మొత్తం రూ. 13.33 కోట్లు లబ్ది చేకూరిందన్నారు. ఇంకా ఎవరైనా అర్హులై మిగిలిపోయి ఉంటే సంబంధిత సచివాలయంలో నమోదు చేసుకోవాలని, వారికి వచ్చే ద్వైవార్షిక కార్యక్రమంలో మంజూరు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులతో కలిసి నమూనా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నెడ్‌క్యాప్ చైర్మన్ కెకె.రాజు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ యువశ్రీ, నాయి బ్రాహ్మణుల కార్పొరేషన్ డైరెక్టర్ వి.నూకరాజు, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ప్రసాద్, రజక, నాయి బ్రాహ్మణ, దర్జీ లబ్ధిదారులు పాల్గొన్నారు.