Oct 30,2022 00:00

పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టుపై సూచనలు చేస్తున్న శేషారెడ్డి

ప్రజాశక్తి- సీలేరు
జికె.వీధి మండలం సీలేరులో రూ.10 వేల కోట్లు వ్యయంతో 1350 మెగావాట్లు సామర్థ్యం గల 9 యూనిట్లతో పంపు స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌ (ఎత్తిపోతల ప్రాజెక్టు) నిర్మాణానికి చర్యలు వేగవంతం చేస్తున్నామని విద్యుత్‌ సౌదా (గుణదలు) ఏపీ జెన్కో హైడల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ (సివిల్‌) శేషారెడ్డి వెల్లడించారు. నూతనంగా విద్యుత్‌ సౌదాలో చీఫ్‌ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారి శనివారం సీలేరు కాంప్లెక్స్‌లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా సీలేరులో ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నెలకొల్పే ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన విధి విధానాలు ఎస్‌ఈ సివిల్‌ కెకెవి.ప్రశాంత్‌ కుమార్‌, ఈఈ సివిల్‌ జాకీర్‌ హుస్సేన్‌, ఏఈ సురేష్‌ను అడిగి తెలుసుకున్నారు. పంపు స్టోరేజ్‌ మ్యాప్‌ని పరిశీలించారు. అనంతరం రెగ్యులేటర్‌ డ్యామ్‌, మెయిన్‌ డ్యాం గేట్లు పనితీరు, నీటి నిల్వలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మరో రెండు మూడు నెలల్లో సీలేరులో పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణం, అటవీశాఖ అనుమతులు రానున్నాయని తెలిపారు. ఆ వెంటనే ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోనే సీలేరు కాంప్లెక్స్‌లోని హైడల్‌ జల విద్యుత్‌ కేంద్రాలు పోల్లూరు, డొంకరాయి, సీలేరు, మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టులకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఇక్కడ విద్యుత్‌ ఉత్పత్తిలో పనితీరు బాగుందని చెప్పారు. పోల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో నూతనంగా నెలకొల్పనున్న 5, 6 యూనిట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని, సామాగ్రి సిద్ధంగా ఉందని చెప్పారు. కొన్ని అనుమతులు రావాల్సి ఉందన్నారు. బలిమెల జలాశయం దిగున ఆంధ్ర ఒడిశా ఉమ్మడిగా నిర్మాణం తలపెట్టిన ఏపీ పవర్‌ హౌస్‌ గత 30 సంవత్సరాలగా సాంకేతికపరమైన సమస్యలతో పెండింగ్‌లో ఉందని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఒక అంగీకారానికి రాకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందని వెల్లడించారు. పర్యటనలో ముందుగా పోల్లూరు, డొంకరాయి జల విద్యుత్‌ కేంద్రాలు, పవర్‌ కెనాల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డ్యామ్‌ అండ్‌ పవర్‌ హౌస్‌ ఏడిఈ సుధీర్‌, ఏడిఈ (క్యాంపు) అప్పలనాయుడు, ఏఈ సురేష్‌ (క్యాంపు) తదితరులు పాల్గొన్నారు.