రూ.68.43 లక్షలు పంట నష్టపరిహారం చెల్లింపు
కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ప్రజాశక్తి - ఏలూరు
జిల్లాలో మూడో విడత వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథక కింద రూ.10.37 కోట్లు, పెట్టుబడి రాయితీ కింద రూ.11.05 కోట్లు జమ చేశామని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. రబీ 2020-21తోపాటు ఖరీఫ్ 2021 సీజన్‌లో లక్ష రూపాయల్లోపు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించి అర్హత పొందిన రైతులకు సున్నావడ్డీ రాయితీ, ఖరీఫ్-2022 పంట నష్ట పరిహారాన్ని వర్చువల్ ద్వారా సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతుల ఖాతాలకు జమ చేశారు. కార్యక్రమంలో స్ధానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వెజ్జు వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి వై.రామకృష్ణ, పెదకడిమికి చెందిన రైతు పర్వతనేని కృష్ణారావు, దెందులూరు మండలం సి.రామవరానికి చెందిన కొత్తపల్లి కుమారితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ రాయితీ కింద 44,820 మంది రైతుల ఖాతాలకు రూ.10.37 కోట్లు మంజూరు చేశారన్నారు. రబీ 2020-21, ఖరీఫ్ 2021కి సంబంధించి జిల్లావ్యాప్తంగా 899 రైతులకు రూ.68.43 లక్షలు పెట్టుబడి రాయితీని మంజూరు చేశారన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ వెజ్జు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పంట రుణాలు తీసుకుని సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు వైఎస్‌ఆర్. సున్నావడ్డీని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. దెందులూరు మండలం సి.రామవరానికి చెందిన మహిళా రైతు కొత్తపల్లి కుమారి మాట్లాడుతూ సున్నా వడ్డీ రాయితీ కింద తనకు రూ.2400 జమైందని చెప్పారు. ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోనే తన ఖాతాకు సొమ్ము జమైందన్నారు. డ్వాక్రాలో సభ్యురాలిగా ఉన్నానని, గత ప్రభుత్వ హయాంలో రూ.6.20 లక్షలు బకాయి ఉండగా జగనన్న అదీ మాఫీ చేశారన్నారు. చేయూత కింద 18,700 సహాయం పొందానన్నారు. పెదవేగి మండలం పెదకడిమికి చెందిన పర్వతనేని కృష్ణారావు మాట్లాడుతూ సున్నావడ్డీ రాయితీ కింద 3,900 రాయితీ పొందగలిగానన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు రూ.లక్షపైనే గతంలో చెల్లించినప్పటికీ రోజులుతరబడి ఎదురు చూడాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు డిడి తీసి ఇస్తే వారం, పది రోజుల్లోనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. స్ప్రేయర్లు, టార్పాలిన్లు కూడా రైతులకు అందించాలని ఆయన కోరారు.










