
రూ.10.10 కోట్లతో డోన్‌లో అభివృద్ధి పనులు
- మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్
ప్రజాశక్తి-డోన్
డోన్ మున్సిపాలిటాలోని 32 వార్డులలో వివిధ రకాల నిధులతో రూ.10 కోట్ల 10 లక్షలతో పనులు చేపట్టినట్లు మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్ తెలిపారు. సోమవారం డోన్ పట్టణంలోని 11వ వార్డులో రూ.37 లక్షల నిధులతో రోడ్లు, డ్రెయినేజీ పనులను ప్రారంభించామని తెలిపారు. ఛైర్మన్ మాట్లాడుతూ సిఎండిఎఫ్ గ్రాంట్స్, గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో పాటు ఎమ్మెల్యే కోటా స్పెషల్ గ్రాంట్స్ ద్వారా 32 వార్డులకు నిధులు కేటాయించి నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 11 వార్డులలో పనులు పూర్తయ్యాయని, మిగతావి రెండు నెలల్లో పూర్తి అవుతాయని తెలిపారు. ఆర్థిక మంత్రి డోన్ మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులు మంత్రి సహకారంతో నిర్వహించామని అన్నారు. రాష్ట్రంలోనే డోన్ మున్సిపాలిటీని ఆదర్శంగా చూడాలనే లక్ష్యంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి చొరవచూపారని, భవిష్యత్తులో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. డ్రెయినేజీ, సిసి రోడ్లు, కల్వర్టుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈకార్యక్రమంలో ఛైర్మన్‌తోపాటు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, డిఇ రసూల్, ఎఇ సురేష్ తదితరులు పాల్గొన్నారు.