
రూ.10 కోట్లతో 'పామిడి' నీటి పథకాన్ని పునరుద్ధరించి 17 గ్రామాలకు తాగునీరు
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ప్రజాశక్తి - ప్యాపిలి
డోన్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు వారి కండ్ల ముందర అభివృద్ధి జరిగితే అభివృద్ధి జరగలేదని మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ప్యాపిలి మండలంలో పర్యటించారు. తొలుత ఎస్.రంగాపురం గ్రామానికి చెందిన బాలరంగయ్య అనే వైసీపీ కార్యకర్త అనారోగ్యంతో ఉండడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.ప్యాపిలి వాసులకు హైదరాబాద్ కు బస్ సౌకర్యం కల్పిస్తూ బుుధవారం కొత్త బస్ సర్వీస్ కు పచ్చజెండా ఊపారు. ప్యాపిలి నుంచి హైదరాబాద్, నంద్యాలకు ప్రారంభమైన బస్ సేవలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్యాపిలి పట్టణంలోని బస్ స్టాండ్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. గతంలో కన్నా మెరుగుపడిన బస్ స్టేషన్ కు తుది మెరుగులు దిద్దాలని అధికారులను ఆదేశించారు. బస్ సర్వీసుల ప్రారంభోత్సవం సందర్భంగా బస్ స్టాండ్ నుంచి పట్టణంలో ఉన్న షాదిఖానా వరకు ప్రయాణం చేశారు. బస్ లో కూర్చుని ప్రయాణీకులు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం 30 లక్షలతో ఆదునికీకరిస్తున్న షాదిఖానా పనులను పరిశీలించారు. తుది దశకు చేరిన షాదిఖానాలో మరుగుదొడ్లు సహా పలు మౌలిక సదుపాయాల పనులను కూడా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అనంతరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ చేరుకుని అక్కడ జరుగుతున్న పురోగతి పనులను ఆర్థిక మంత్రి పరిశీలించారు. మరుగుదొడ్లు, గెస్ట్ హౌస్ కు ఒక వైపు ఉన్న గేటు మార్చాలని ఆదేశించారు. పార్కులు, పచ్చని చెట్లు, చిన్నారులకు ఆడుకునే వసతులు, ఇందిరాగాంధీ కాలంలో బస చేసినట్లు చెప్పుకునే అతిథి గృహాన్ని అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంత్రి సమక్షంలో జలదుర్గం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు వైసీపీ లోకి చేరాయి. 253 కోట్లతో 77 చెరువులకు నీరు నింపే కార్యక్రమంలో భాగంగా కిలోమీటర్ల దూరం సాగునీటిని పైప్ లైన్ ద్వారా తీసుకువచ్చి అందిస్తున్నట్లు, ఇది చాలా ప్రత్యేకమైన ప్రాజెక్టుగా మంత్రి తెలిపారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో పామిడి నీటి పథకం పేరుతో 14 గ్రామాలకు తాగునీరందించే ప్రాజెక్టును తిరిగి చేపట్టామన్నారు . వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటికి 2 గ్రామాలకే అప్పుడప్పుడు నీరిచ్చే దశకు దిగజారిన పరిస్థితిని 10 కోట్లు ఖర్చు పెట్టి పునవైభవంలోకి తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఉద్దేశం కన్నా మరో 3 గ్రామలు అధికంగా ప్యాపిలిలో 17 గ్రామాలకు తాగునీరిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్యాపిలిలో డబుల్ రోడ్లు, పల్లెపల్లెకు రహదారులు, బస్ స్టాండ్, బస్ సేవల పెంపు అభివృద్ధి ఏనాడైనా ఊహించారా అని ప్రజలను ప్రశ్నించారు. తాగునీటి కోసం ప్యాపిలిలో ఉన్న ఇబ్బందులను మారుమూల గ్రామాల్లో కూడా పరిష్కరించి రూ.350 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామన్నారు.వేల కోట్లతో ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే ప్రాజెక్టులను తీసుకువచ్చి, పూర్తి చేస్తున్నా ప్రతిపక్షాలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు.పెళ్లైన నెలకే పిల్లలు కావాలన్న చందంగా కరవుపై ప్రతిపక్షాల వైఖరి ఉందని మంత్రి పేర్కొన్నారు. పరిస్థితులను విడతలవారీగా పరిశీలించి అధ్యయనం చేసి కరవును ప్రకటిస్తారన్న విషయం విపక్షాలకు తెలియదా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో హుందాతనం, బాధ్యత, మాటమీద నిలబడే వ్యక్తిత్వం లేని వ్యక్తి టీడీపీ డోన్ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి అన్నారు. డోన్ నియోజకవర్గ ప్రజలకు సెంటున్నర స్థలంలో ఇళ్ల పట్టాలిస్తానని ఇంటింటికి తిరుగుతున్న విధానమే అందుకు నిదర్శనమన్నారు. ప్రజలను అమాయకులను చేసి తర్వాత నిలువునా ముంచాలనుకునే ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రకటిస్తున్నారని అన్నారు. గెలిచినప్పుడు చూద్దాంలే అనే ధోరణితో ఇలా హామీలు ఇచ్చి మోసం చేయకపోతే టీడీపీ సీటు కూడా దక్కదనే ధర్మవరం సుబ్బారెడ్డి ఇలా వింత హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్యాపిలి పట్టణానికే 7వేల మంది పేదలకు ప్లాట్లు ఇవ్వాలంటే 175 ఎకరాలు కావాలన్నారు. ప్యాపిలి చుట్టుపక్కల ఎకరానికి రూ.50 లక్షల చొప్పున రూ.87.5 కోట్లు పెట్టి టీడీపీ డోన్ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి ఇళ్ల పట్టాలిస్తారా? టీడీపీ అధినేత చంద్రబాబు ఇస్తారా? ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామ్ రెడ్డి, మార్కెట్ యార్డు ఛైర్మన్ రాజనారాయణ మూర్తి, మండల వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ మెట్టు వెంకటేశ్వరెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీదేవి, మల్లికార్జున్రెడ్డి, భువనేశ్వర్ రెడ్డి, బొరెడ్డి రాము, కృష్ణారెడ్డి,కమతం భాస్కర్ రెడ్డి,రామచంద్రారెడ్డి, మస్తాన్ ఖాన్, రామిరెడ్డి, చంద్రయ్య,ప్రభాకర్ రెడ్డి విగ్నేశ్వర్ రెడ్డి, సాగర్ రెడ్డి, నిజాముద్దీన్, రసూల్, రఘు బషీర్, షాషా, ఎర్రిస్వామి, అంజి, ఇమాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
a