
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు రూరల్ ఓబులునాయుడు పాలెం గ్రామంలో శ్రీరామ్ ఆగ్రో కెమికల్ ఇండిస్టీస్‌లో అనుమతులు లేకుండా నాసిరకంగా పురుగు మందులను తయారు చేసి విక్రయిస్తుండగా రూ.3.78 లక్షల విలువైన సరుకును మంగళవారం విజిలెన్సు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 4 రకాల పురుగు మందులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. క్లోరో ఫైరిఫాస్ గుళికలు, కార్ టాప్ హైడ్రో క్లోరైడ్, కలుపు మందులు తయారు చేస్తున్నారని అధికారులు తెలిపారు. లైసెన్సు గడువు తీరినప్పటికీ అనధికారికంగా మందులు తయారు చేస్తున్నారని గుర్తించారు. నిల్వలు స్వాధీనం చేసుకుని డీలర్ పై క్రిమినల్ కేసును నమోదు చేయవలసినదిగా స్థానిక వ్యవసాయ అధికారిని విజిలెన్స్ అధికారులు ఆదేశించినారు. తనిఖీలలో విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ వ్యవసాయ అధికారి వాసంతి, సబ్ ఇన్‌స్పెక్టర్ రామచంద్రయ్య పాల్గొన్నారు.