చెక్కును అందజేస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ
రూ. 292.26 కోట్లు అమ్మఒడి నగదు జమ
నెల్లూరు:జిల్లాలో 2022-23 ఏడాదికి సంబంధించి 1,94,842 మంది తల్లుల ఖాతాలకు రూ. 292.26 కోట్లు నిధులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ వెల్లడించారు. బుధవారం వరుసగా నాలుగో ఏడాది అమ్మఒడి నిధులను పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నుంచి ముఖ్యమంత్రి విడుదల చేయగా, కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, జిల్లా విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థుల కలలను సాకారం చేయడమే లక్ష్యంగా, ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ముఖ్యమంత్రి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. విద్యావ్యవస్థలో అనేక రకాల సంస్కరణలు అమలుచేస్తూ పేద విద్యార్థుల సంక్షేమానికి కషి చేస్తున్న ముఖ్యమంత్రికి విద్యార్థుల తల్లిదండ్రుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డు రాకూడదని, ప్రతి తల్లి కూడా తమ బిడ్డలను చదివించాలనే ఆలోచన చేసేలా అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. పుట్టిన బిడ్డకు అందించే వైయస్సార్ సంపూర్ణ పోషణ నుంచి విద్యార్థి దశ వరకు అనేక దశలవారీగా కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి బడిలో ఉండాలనే లక్ష్యంతో విద్యా వ్యవస్థలో అనేక కార్యక్రమాలను అమలు చేసినట్టు చెప్పారు. ప్రతి ఒక్క తల్లి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి మెరుగైన విద్యను వారికి అందించాలని పిలుపునిచ్చారు. తొలుత అమ్మ ఒడి నగదుకు సంబంధించిన మెగా చెక్కును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, డిప్యూటీ డీఈవో లక్ష్మీ ప్రసూన, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.










