Jan 22,2022 07:01

రష్యాకు, ఉక్రెయిన్‌కు మధ్య విభేదాలు ఉంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఆ రెండు దేశాలు చూసుకుంటాయి. మధ్యలో అమెరికా జోక్యమేమిటి? ఉక్రెయిన్‌కు రక్షణ కల్పించే పేరుతో నాటో బలగాలు తమ పెరటి దాకా చొచ్చుకొస్తుంటే రష్యా చేతులు ముడుచుకు కూర్చోవాలా? ఎక్కడి నుంచో అమెరికా తన బలగాలను తీసుకొచ్చి రష్యా చుట్టూ మోహరిస్తే అది తప్పు కాదు. రష్యా తన సరిహద్దులకు సేనలను పంపితే అది తప్పట! ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న సైనిక దూకుడుకు చెక్‌ పెట్టాల్సిన అవసరమెంతైనా ఉంది.

   మెరికా, దాని యూరోపియన్‌ మిత్రులు ఉక్రెయిన్‌ను వేదికగా చేసుకుని రష్యాతో కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. వాటి మాటలు, చేతలు రష్యాతో ప్రకటిత లేదా అప్రకటిత యుద్ధానికి దారితీసేలా ఉన్నాయి. న్యూయార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్టు వంటి సామ్రాజ్యవాద అనుకూల ప్రచార బాకాలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. రష్యాను యుద్ధోన్మాదిగా, దురాక్రమణ దారుగా చిత్రించేందుకు అవి తమ వద్ద ఉన్న టక్కుటమార విద్యలన్నిటిని ప్రదర్శిస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా దురాక్రమణకు పాల్పడుతున్నది, ప్రపంచంపై మతిమాలిన యుద్ధాలను రుద్దుతున్నది అమెరికానే. ప్రస్తుతం రష్యాకు తూర్పున ఉన్న 800 మైళ్ల సరిహద్దు పొడవునా నాటో బలగాలను మోహరించి కవ్వింపు చర్యలకు దిగుతున్నదీ ఈ అగ్రరాజ్యమే. ఒకవైపు ఇటువంటి యుద్ధోన్మాదాన్ని సాగిస్తూ, మరో వైపు రష్యానే ఈ ఉద్రిక్తతలకు కారణమన్నట్లు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నది. ఇరాక్‌పై దండెత్తడానికి ముందు సద్దాం హుస్సేన్‌ వద్ద సామూహిక మారణాయుధాలు పెద్దయెత్తున పోగుపడి ఉన్నాయని అమెరికా, దాని మిత్ర దేశాలు ఇలానే తప్పుడు ప్రచారం చేశాయి. ఆ పేరుతో సద్దాంను ఉరి తీసి, ఆ దేశాన్ని సర్వనాశనం చేశాయి. అంతకుముందు బోస్నియా, సెర్బియాల్లో జోక్యం చేసుకుని బాంబు దాడులు చేశాయి. 2001లో ఆఫ్ఘనిస్తాన్‌లో, 2009లో సోమాలియాలో సైనిక చర్యకు పాల్పడ్డాయి. 2011లో లిబియా ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఆ దేశ అధ్యక్షుడు కల్నల్‌ గడాఫీని పట్టుకుని కాల్చిచంపాయి. సిరియాలో అసద్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా పెద్దయెత్తున వైమానిక దాడులకు పాల్పడింది. సిరియాకు అండగా రష్యా నిలవడంతో దాని ఆటలు సాగలేదు. సోవియట్‌ యూనియన్‌ పతనం తరువాత తనకు ఎదురే లేదని విర్రవీగిన అమెరికన్‌ సామ్రాజ్యవాదం ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అవమానకరమైన రీతిలో నిష్క్రమించాల్సి వచ్చింది, ఈ పరిస్థితుల్లో ప్రపంచాధిఫత్యాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు నాటో దళాల విస్తరణకు పూనుకుంది. దీనిలో భాగంగానే ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఆసరా చేసుకుని రష్యాను దెబ్బతీసేందుకు పావులు కదుపుతోంది. రష్యాకు, ఉక్రెయిన్‌కు మధ్య విభేదాలు ఉంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఆ రెండు దేశాలు చూసుకుంటాయి. మధ్యలో అమెరికా జోక్యమేమిటి? ఉక్రెయిన్‌కు రక్షణ కల్పించే పేరుతో నాటో బలగాలు తమ పెరటి దాకా చొచ్చుకొస్తుంటే రష్యా చేతులు ముడుచుకు కూర్చోవాలా? ఎక్కడి నుంచో అమెరికా తన బలగాలను తీసుకొచ్చి రష్యా చుట్టూ మోహరిస్తే అది తప్పు కాదు. రష్యా తన సరిహద్దులకు సేనలను పంపితే అది తప్పట! ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న సైనిక దూకుడుకు చెక్‌ పెట్టాల్సిన అవసరమెంతైనా ఉంది. అమెరికన్‌ బహుళజాతి కంపెనీల మార్కెట్‌ విస్తరణకు, సూపర్‌ లాభాలకు చైనా, రష్యాలు తనకు పెద్ద అడ్డంకిగా మారాయని అగ్రరాజ్యం భావిస్తున్నది. గతంలో అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఆయన పెంటగాన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, అమెరికాకు రష్యా, చైనా ఈ రెండు దేశాల నుంచే ముప్పు పొంచివుందని, వీటిని ఓడించేందుకు పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం కావాలని, ఆ యుద్ధంలో అమెరికా అజేయమైన శక్తిగా తిరిగిరావాలని ఉద్బోంధించాడు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఇదే వైఖరిని కొనసాగిస్తూ వచ్చాయి. చైనాను దెబ్బ తీయడానికి ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో క్వాడ్‌ కూటమి (అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌) ఏర్పాటు చేసిన అమెరికా, రష్యాకు వ్యతిరేకంగా మధ్య ఆసియాలో మరో క్వాడ్‌ను ఏర్పాటు చేసింది. చైనాను బెదిరించేందుకు దక్షిణ కొరియాలో థాడ్‌ వంటి అధునాతన క్షిపణి వ్యవస్థను నెలకొల్పింది. చైనాకు పశ్చిమవైపు ముఖద్వారంగా ఉన్న షింజియాంగ్‌లో చిచ్చు రేపే యత్నం చేసింది. మరో వైపు రష్యాను దెబ్బ కొట్టేందుకు నాటోను ముందుకు తెస్తున్నది. ఐరోపాలోని రష్యా సరిహద్దుల పొడవునా భారీగా నాటో దళాలను మోహరించి, నల్ల సముద్ర పరీవాహక ప్రాంతంలోని టర్కీ, బల్గేరియా, రుమేనియాలను, బాల్టిక్‌ తీరంలోని లాత్వియా, ఎస్తోనియా, లిథువేనియా, పోలండ్‌లను నాటో సైనిక కూటమిలో భాగస్వాములుగా చేర్చుకుని రష్యాకు వ్యతిరేకంగా నిలబెట్టే యత్నం చేస్తున్నది.
    సోవియట్‌ యూనియన్‌ పతనమైనప్పుడు రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందంలో నాటోను ఒక్క అంగుళం కూడా తూర్పు వైపు విస్తరించబోమని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఏడు దేశాలను కొత్తగా ఈ కూటమిలో చేర్చుకుంది. తన మాట వినని బెలారస్‌లోని లుకషెంకో ప్రభుత్వాన్ని అస్థిరత్వ పాల్జేసేందుకు అమెరికా కుట్ర పన్నింది. 2019లో ఎన్నికల తరువాత లుకషెంకోకు వ్యతిరేకంగా పెద్దయెత్తున నిరసనలను రెచ్చగొట్టడంలో అమెరికా పాత్ర ఉంది. తాజాగా కజకిస్తాన్‌ లోనూ అటువంటి యత్నమే చేసింది. రష్యా వెంటనే కలుగజేసుకుని ఆ కుట్రలను తిప్పికొట్టింది. ఉక్రెయిన్‌ విషయానికొస్తే 2011 ఎన్నికల్లో సామ్రాజ్యవాద అనుకూల ప్రభుత్వం అక్కడ ఓడిపోయింది. ఆ ప్రభుత్వాన్ని పునరుద్ధరించడం కోసం అమెరికా నిధులు ఇచ్చి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రెచ్చగొట్టింది. చివరికి 2014లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు యుకోవిచ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి తనకు అనుకూలమైన ప్రభ్వుం ఏర్పడేలా చూసుకుంది. అప్పటి నుంచి అమెరికా, రష్యా మధ్య విభేదాలు మరింతగా ముదిరాయి. రష్యా చుట్టూ అమెరికా సైనిక వలయాన్ని బిగించనారంభించడంతో రష్యా కూడా సరిహద్దుల్లో రక్షణ చర్యలను ముమ్మరం చేసింది. రష్యా ప్రపంచంలోనే అతి పెద్ద భూభాగం కలిగిన దేశం. ఉత్తరాన ఆర్కిటిక్‌ ప్రాంతం నుంచి సుదూర తూర్పు పసిఫిక్‌ ప్రాంతం దాకా విస్తరించిఉండేది. రష్యాలో ప్రధాన భూభాగం అంతా మైదానాల మధ్య ఉంది. పశ్చిమాన యూరప్‌ నుంచి రష్యాపై దండెత్తితే వాటిని ఆపడానికి ఎలాంటి సహజ సిద్ధమైన రక్షణ కుడ్యాలు లేవు. గత రెండు శతాబ్దాల్లో రెండు విధ్వంసకర యుద్ధాలను ఎదుర్కొంది. 1812లో నెపోలియన్‌, 1941లో నాజీ హిట్లర్‌ రష్యాపై దండెత్తారు. ఆ యుద్ధాలలో రష్యా విజయం సాధించినప్పటికీ అపారమైన ప్రాణ నష్టాన్ని చవిచూసింది. నాజీలతో యుద్ధంలో 2.7 కోట్ల మంది రష్యన్లు ఆనాడు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రష్యా మరింత అప్రమత్తమైంది. నల్ల సముద్రానికి ఉత్తరాన ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీపకల్ప ప్రాంతాన్ని స్వతంత్ర రిపబ్లిక్‌గా గుర్తిస్తూ 2014 ఫిబ్రవరిలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ డిక్రీ జారీ చేశారు. దీనిని రష్యా దురాక్రమణగా అమెరికా, యూరోపియన్‌ దేశాలు గగ్గోలు పెట్టాయి. కానీ ఎక్కువ దేశాలు క్రిమియాను రష్యా ఫెడరేషన్‌లో భాగంగానే పరిగణిస్తున్నాయి. క్రిమియాలోని అత్యధిక ప్రజానీకం తాము రష్యాతో ఉండాలని కోరుకున్నారు. దీనిపై నిర్వహించిన రిఫరెండమ్‌లో 85 శాతం మంది పాల్గొనగా 96.9 శాతం మంది రష్యాతో ఉండడానికే మొగ్గు చూపారు. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నానికి సారథ్యం వహించిన మిఖాయిల్‌ గోర్బచేవ్‌ సైతం ఇది క్రిమియా ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. పద్దెనిమిదవ శతాబ్దంలో జార్‌ చక్రవర్తి పాలనలో ఉండగా రష్యాలో భాగంగా క్రిమియా ఉండేది. స్టాలిన్‌ మరణం అనంతరం 1954లో ఈ ప్రాంతం మాజీ సోవియట్‌ యూనియన్‌లో రిపబ్లిక్‌గా ఉన్న ఉక్రెయిన్‌కు బదిలీ చేయబడింది. క్రిమియాలో మెజారిటీ ప్రజలు రష్యన్‌ భాషనే మాట్లాడతారు, రష్యాతో బలమైన సాంస్కృతిక బంధం ఉన్నది. రష్యన్‌ రూబుల్‌నే రెండవ కరెన్సీగా వినియోగిస్తారు. క్రిమియా ప్రజల అభీష్టం మేరకు జరిగిన ఈ విలీనాన్ని అక్రమం అని వాదిస్తున్న అమెరికా, దాని మిత్రదేశాలు, మరి యుగోస్లావియా నుంచి క్రొయేషియాను, సెర్బియా నుంచి కొసావోను ఏ ప్రాతిపదికన విడగొట్టాయో సెలవిస్తే బాగుంటుంది.
    రష్యా సరిహద్దుల్లో నాటో దళాలను, యుద్ధ శకటాలను మోహరించి రెగ్యులర్‌గా మిలిటరీ కవాతులు నిర్వహిస్తూ ఆ దేశాన్ని యుద్ధంలోకి లాగాలని చూస్తున్న అమెరికా పన్నాగం ప్రపంచ శాంతికే ప్రమాదం. ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని నివారించేందుకు అంతర్జాతీయ కార్మికవర్గం, సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరముంది.

కె. గడ్డెన్న