Apr 09,2023 00:01

నినాదాలు చేస్తున్న రసూల్‌ డెకర్‌ ప్లైవుడ్‌ కంపెనీ ముఠా కార్మికులు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
ముఠా కార్మికులు సమస్యలను పట్టించుకోకుండా రసూల్‌ డెకర్‌ యాజమాన్యం మొండిగా వ్యవహరించడం సరికాదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.రాము అన్నారు. దిబ్బపాలెం గ్రామానికి చెందిన 100 మంది ముఠా కార్మికులు రసూల్‌ డెకర్‌ ప్లై వుడ్‌ పరిశ్రమ వద్ద చేపట్టిన ఆందోళన శనివారం నాటికి నాలుగో రోజుకు చేరింది. 2019 ఒప్పందం ప్రకారం ముఠా కార్మికులకు చెల్లింపులు యధాతధంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. వీరి ఆందోళనకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌ రాము సంపూర్ణమైన మద్దతు తెలియజేసి మాట్లాడారు. ముఠా కార్మికులకు పాత పద్ధతిలోనే కూలి రేట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమలకు భూములిస్తే మీ జీవితాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని నాడు చెప్పిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు ముఠా కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. యాజమాన్యంతో చేతులు కలిపి నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఏపీఐఐసీ అధికారులు, కలెక్టర్‌ స్పందించి ముఠా కార్మికులకు న్యాయం చేయాలని రాము డిమాండ్‌ చేశారు. లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.సత్యనారాయణ, గొర్లి సత్తిబాబు, గొర్లు ఇరికినాయుడు, అంది అప్పలనాయుడు, గుర్రం సూరిబాబు, బయలుపూడి రమణ, సిహెచ్‌ వెంకన్న, వి నానాజీ, కర్రి కొండబాబు, నిర్వాసిత ముఠా కార్మికులు పాల్గొన్నారు.