
ప్రజాశక్తి అచ్యుతాపురం
అచ్చుతాపురం సెజ్‌లో రసూల్ డెకర్ ప్లైవుడ్ కంపెనీ ఆవరణలో దిబ్బపాలెం గ్రామానికి చెందిన ముఠా కార్మికులు రెండో రోజు గురువారం తమ ఆందోళనను కొనసాగించారు. మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరి ఆందోళనకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రాము మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో పరిశ్రమ స్థాపించినప్పటి నుండి 100 మంది ముఠా కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ట్రాక్టర్లు, లారీలు, వ్యాన్లో పరిశ్రమ వద్దకు వచ్చిన కలపను ముఠా కార్మికులు అన్లోడింగ్ చేస్తారని, అందుకు పరిశ్రమ కొంత డబ్బులు చెల్లిస్తుందని చెప్పారు. ఈ మధ్యకాలంలో స్థానిక ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆదేశాలతో ముఠా కార్మికులకు చెల్లిస్తున్న మామూలు పద్ధతిని యాజమాన్యం అర్ధాంతరంగా నిలిపివేసిందని, గేటు లోపలికి రావద్దని యాజమాన్యం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పరిశ్రమ యాజమాన్యం, స్థానిక ఎమ్మెల్యే కలిసి ముఠా కార్మికుల పొట్ట కొట్టడం దారుణమన్నారు. స్థానికులకు 75శాతం ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినా, ప్రైవేటు యాజమాన్యాలు దాన్ని పక్కనపెట్టి ఉన్న ఉపాధిని కూడా పోగొట్టే పద్ధతులు అనుసరిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం ముఠా కార్మికుల కోర్కెను అంగీకరించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిర్వాసితులను, కార్మికుల సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెజ్ నిర్వాసిత ప్రతినిధి తుమ్మల రాజు పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరహాల నాయుడు, గొర్లి నాగేష్, గుర్రం సూరిబాబు, గొర్ల సత్తిబాబు, ఏ చిన్న అప్పలనాయుడు, ఏ గోవిందరావు, ముఠా కార్మికులు, నిర్వాసితులు పాల్గొన్నారు.