
ప్రజాశక్తి- రాంబిల్లి
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎస్‌ఇజెడ్‌లోని రసూల్ డెకర్ ప్లైవుడ్ కంపెనీ గేటు ముందు ముఠా కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము మాట్లాడుతూ రూసూల్ డెకర్ ప్లైవుడ్ కంపెనీలో 2019 నుండి దిబ్బపాలెం నిర్వాసితులు సుమారు వందమంది ముఠా కార్మికులుగా లోడింగ్, అన్లోడింగ్ పనులు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిశ్రమకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే కర్రలు లారీల నుండి రూ.500, వ్యాన్‌కు రూ.300, ట్రాక్టరుకు రూ.200 చొప్పున తీసుకొని జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. అయితే నెలరోజుల క్రితం ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కంపెనీకి వచ్చి యాజమాన్యంతో మాట్లాడి మామూళ్లు ఇవ్వవద్దని చెప్పడంతో యాజమాన్యం బయట బోర్డులు పెట్టి ముఠా కార్మికులు రావాల్సిన మామూళ్లు నిలుపుదల చేశారని పేర్కొన్నారు. దీంతో ముఠా కార్మికులు నెలరోజులు నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూములు కోల్పోయి, నిర్వాసితులుగా మారి, ముఠా కార్మికులుగా పని చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. పాత పద్ధతిలో లోడింగ్ అన్లోడింగ్ పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్థానికులకు 75శాతం ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినా ప్రైవేటు యాజమాన్యాలు దానిని పక్కనపెట్టి, ఉన్న ఉపాధిని కూడా పోగొట్టే పద్ధతులు అనుసరించడం దారుణమన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం సమస్యలను పరిష్కరించాలని లేకుంటే కార్మికులను సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాకు తుమ్మల రాజు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వరహాల నాయుడు, గొర్లి నాగేష్, గుర్రం సూరిబాబు, గొర్ల సత్తిబాబు, ఎ.చిన్న అప్పలనాయుడు, ఎ.గోవిందరావు ముఠా కార్మికులు పాల్గొన్నారు.