Dec 25,2022 21:53

అధికార వైసిపికి అసంతృప్తి సెగ
ఇంకా పుంజుకోని టిడిపి
స్థానిక సమస్యలపై దృష్టి కేంద్రీకరించిన జనసేన
ఉనికి కోసం బిజెపి, కాంగ్రెస్‌ పాట్లు
ప్రజా పోరాటాలే ఊపిరిగా వామపక్షాలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

అధికార వైసిపిపై ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకీ పెరుగుతోంది. అదే సమయంలో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఈ ఏడాదీ అంత చురుగ్గా వ్యవహరించిన దాఖలాల్లేవు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసిపి భావిస్తుండగా, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే తమకు అనుకూలిస్తాయని ప్రధాన ప్రతిపక్షం భావిస్తోంది. జనసేన జిల్లాలో ప్రధానంగా సేవా కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై పోరాడుతూ బలపడేందుకు యత్నిస్తుండగా బిజెపి, కాంగ్రెస్‌ ఇప్పటికీ తమ ఉనికిని చాటుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాయి. ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా ప్రజాసమస్యలే ఎజెండాగా వామపక్షాలు నిరంతరం పోరాటాలతో ముందుకు సాగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ ఏడాది ఆయా పార్టీల అధినాయకుల పర్యటనలతో జిల్లా రాజకీయం రసకందాయంగా మారింది.
ప్ర్రజావ్యతిరేక విధానాలు, సొంత కుంపట్లతో మసకబారుతున్న వైసిపి ప్రతిష్ట
సంక్షేమ పథకాల అమలుతో వైసిపికి కొంత సానుకూలత ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల ఫలితంగా ఆ పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన పట్టణాల్లో చెత్త, ఆస్తి పన్ను, విచ్చలవిడిగా పెంచిన విద్యుత్‌, ఆర్‌టిసి ఛార్జీలు, వ్యవసాయ విద్యుత్‌ మీటర్ల అమరికకు కసరత్తు, రహదారుల వ్యవస్థ అధ్వానంగా తయారైనా పట్టించుకోకపోవడం వంటి అనేక అంశాలు వైసిపిపై జనంలో అసంతృప్తిని పెంచాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జిల్లాల విభజన చేసినా ఇప్పటికీ గాడిన పరిస్థితి లేదు. నూతన జిల్లా కేంద్రం భీమవరంలో ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక వరి రైతుల ఇబ్బందులు మరింత పెరిగాయి. రైతులు ధాన్యం అమ్మకంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం సొమ్ము జమ నెలలు తరబడి సాగడంతో ఈ ఏడాది రబీలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖరీఫ్‌లో తెచ్చిన నూతన ధాన్యం కొనుగోలు విధానం రైతులను నిలువునా ముంచింది. ఆక్వా రైతులకు ఇచ్చే విద్యుత్‌ సబ్సిడీ జోన్లకే పరిమితం చేయడం, రొయ్య వంద కౌంట్‌కు రూ.240 ధర అందేలా చేస్తామన్నా చేయలేకపోవడం, ఆక్వా మేత ధరలు పెరిగిపోవడం వంటి అనేక పరిణామాలు వైసిపిని వెంటాడుతున్నాయి. పోలవరం నిర్మాణం, నిర్వాసితులకు పునరావాసం, పరిహారం పంపిణీ వంటివి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. గడిచిన ఆగస్టు, సెప్టెంబర్‌లో వరదలకు పోలవరం నిర్వాసితులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గోదావరి నుంచి తాగునీరు అందిస్తామని ఇచ్చిన వాటర్‌గ్రిడ్‌ హామీ సైతం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రోడ్ల వ్యవస్థ అధ్వానంగా మారడంతో జనాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. 45 ఏళ్లు పైబడిన మహిళలకు ఇస్తున్న చేయూత, అమ్మఒడి పథకాలు ప్రభుత్వానికి కొంత సానుకూలత తెచ్చినప్పటికీ పెరిగిన ధరలు, నూతన విద్యావిధానం అమలు, ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనం వంటి వాటిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం సరిపోకపోవడం, లేఅవుట్లలో పలు సమస్యలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణంగా మారాయి.
రెండోవిడత మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండు మంత్రి పదవులు కేటాయించినప్పటికీ ఏలూరు జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించకపోవడం చర్చనీయాంశమైంది. ఏలూరు ఎంఎల్‌ఎ ఆళ్ల నాని, ఆచంట ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాధరాజు మంత్రి పదవులు కోల్పోయారు. చెరుకువాడను కొనసాగించకపోవడం క్షత్రియ సామాజిక తరగతిలో కొంత అసంతృప్తికి కారణమైంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై గెలుపొందిన గ్రంధి శ్రీనివాస్‌కు చివరి నిమిషంలో మంత్రి పదవి చేజారడం సొంత పార్టీపైనే వ్యతిరేకతకు కారణమైంది. ఇక జిల్లా కేంద్రం విషయంలో నరసాపురం ఎంఎల్‌ఎ ముదునూరి, మాజీ మంత్రి కొత్తపల్లి మధ్య సాగిన మాటల యుద్దం అధిష్టానానికి తలనొప్పి తెచ్చిపెట్టింది. చివరకు పార్టీ నుంచి కొత్తపల్లి సస్పెన్షన్‌కు దారితీసింది. ఇక ఉండి నియోజకవర్గంలో తరచూ ఇన్‌ఛార్జీల మార్పు ఈ ఏడాదీ కొనసాగడం ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసిపి నేత గంజి ప్రసాద్‌ను అదే పార్టీకి చెందిన ఎంపిటిసి బజారయ్య హత్య చేయించడం, ఆ గ్రామానికి వెళ్లిన గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావును సొంతపార్టీవారే నిర్బంధించి దాడికి పాల్పడటం ఆ పార్టీలో నెలకొన్న గ్రూపు విబేధాలను ప్రతిబింబించింది. చింతలపూడి నియోజకవర్గంలో ఎంఎల్‌ఎ ఎలిజా, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఈ ఏడాదీ కొనసాగాయి. జిల్లా కేంద్రం ఏలూరులో అయితే మేయర్‌పై, కమిషనర్‌పై సొంత పార్టీ నేత విమర్శలు గుప్పించడం, కార్పొరేటర్‌ అవినీతి ఆరోపణలు చేయడం వైసిపి ప్రతిష్టను బాగా దెబ్బతీశాయని చెప్పొచ్చు.
బలం పుంజుకోని టిడిపి
ప్రభుత్వంపై వస్తున్న ప్రజావ్యతిరేకతను తమవైపు తిప్పుకునేలా ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఇంకా క్షేత్రస్థాయిలో చురుగ్గా కదులుతున్న పరిస్థితి లేదు. రాష్ట్ర నాయకత్వం పిలుపులను అమలు చేయడం తప్ప జిల్లాలోని ప్రజా సమస్యలపై ముందుండి పోరాడటంలో టిడిపి నాయకులు పెద్దగా చొరవచూపిన పరిస్థితి లేదు. పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకు సాగుతున్నా మిగిలిన నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి కన్పించడం లేదు. టిడిపి అధినేత చంద్రబాబు ఇటీవల మెట్ట ప్రాంతంలో మూడురోజుల పాటు చేసిన పర్యటన పార్టీ కేడర్‌లో కొంత ఉత్సాహాన్ని తెచ్చింది. టిక్కెట్ల కేటాయింపు విషయంపై స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లోనూ కొంత స్తబ్ధత నెలకొంది. ఇప్పటికీ ఆ పార్టీలో అంతర్గతంగా ముఠా కుమ్ములాటలు సాగుతుండటం గమనార్హం. చింతలపూడి నియోజకవర్గంలో మాజీ మంత్రి సుజాత, మాజీ ఎంపీ మాగంటి గ్రూపులు వేర్వేరుగానే ఉన్నాయి. పోలవరంలోనూ అదే సమస్య కొనసాగుతోంది. ఉండిలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, మాజీ ఎంఎల్‌ఎ శివ సోదరులైనప్పటికీ అంతర్గతంగా వేర్వేరు గ్రూపులుగానే శ్రేణులు కదులుతున్నాయి. నరసాపురంలో మాజీ ఎంఎల్‌ఎ బండారు మాధవనాయుడు, పొత్తూరి రామరాజు మధ్య విబేధాలు అలానే కొనసాగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కేడర్‌ ఉన్నప్పటికీ నియోజకవర్గాల్లో నాయకత్వ లోపం టిడిపిని వెంటాడుతోంది.
ఉనికి కోసం బిజెపి, కాంగ్రెస్‌ పాట్లు
జిల్లాలో ఈ సంవత్సరం కూడా బిజెపి, కాంగ్రెస్‌ ఉనికిని చాటుకునేందుకు కొటుమిట్టాడుతున్నాయి. ఇటీవల బిజెపి రాష్ట్ర, జాతీయ నాయకులు జిల్లాలో పర్యటిస్తున్న పెద్దగా స్పందన లేదు. పోలవరానికి నిధులివ్వకపోవడం, గ్యాస్‌, పెట్రోల్‌, వంటనూనె ధరలు వంటివి పెంపుతో బిజెపిపై జనం మండిపడుతున్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం నాయకులు సైతం లేని పరిస్థితి ఏర్పడింది.
సేవా కార్యక్రమాలపైనే జనసేన దృష్టి
ఈ ఏడాది జనసేన జిల్లాలో సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడంతోపాటు స్థానిక సమస్యలపై దృష్టి సారించి ముందుకు సాగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపును విస్తరించడానికి ఆ పార్టీ ముమ్మర ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా గ్రామీణప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, శ్రమదానాలు ఆ పార్టీకి సానుకూలతను తెచ్చిపెట్టాయి. అయితే ఇప్పటికీ ఆ పార్టీలో కేడర్‌ సమస్య ఉంది.
ప్రజలకు అండదండగా వామపక్షాలు
ఓట్లు సీట్లతో సంబంధం లేకుండా పోరాటాలు ఈ ఏడాది వామపక్షాలు సాగించాయి. జిల్లాలో సిపిఎం ప్రధాన భూమిక పోషిస్తూ సిపిఐ, న్యూడెమోక్రసీ వంటి పార్టీలను కలుపుకుని వివిధ రూపాల్లో ఆందోళన, పోరాటాలను సాగిస్తోంది. వరదల సమయంలో నిర్వాసితులను ఆదుకోవడంలో సిపిఎం ముందు వరుసలో నిలిచింది. పోలవరం నిర్వాసితుల సమస్యలపై సిపిఎం అలుపెరుగని పోరాటం చేస్తోంది. వరి రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ధరల పెరుగుదల, కార్మికుల సమస్యలు వంటి ప్రజాసమస్యలపై నిరంతరం పోరుబాట సాగిస్తూ ప్రజలతో వామపక్షాలు మమేకమై ముందుకు సాగాయి.