
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం సోమవారం అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల వాగ్వావాదాలతో దద్దరిల్లింది. 20వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ రామరాజు మాట్లాడుతూ, తన వార్డులో గత మూడున్నర సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు.ముఖ్యంగా తమ గ్రామం లింగాపురం గ్రామానికి అప్రోచ్ రోడ్డు, తాగునీరు కల్పన వంటి సదుపాయాలు కల్పించలేదన్నారు. పారిశుధ్యం కూడా మెరుగు పరచుకోలేక పోయానని వాపోయానని తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఈ సంఘటనతో సమావేశ మందిరంలో కౌన్సిలర్లు, చైర్పర్సన్, అధికారులు అవాక్కయ్యారు. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో తనను ఎన్నుకున్న ప్రజలకు ఏమి న్యాయం చేయలేక పోయానని, గిరిజన గ్రామంలో తాము పుట్టడమే తప్పా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామానికి రోడ్డు కూడా వేయించుకోలేకపోయినని, వీధి కులాయిలు, వీధిలైట్లు వేయించలేని దౌర్భాగ్య పరిస్థితి నెల కొందన్నారు. దీంతోనే, చెప్పుతో కొట్టుకున్నానని అనగా వైసిపి కౌన్సిలర్లు హేళన చేయడం తనను బాధించిందని రామరాజు వాపోయారు. అలాగే పలు సమస్యలపై టిడిపి, వైసిపి కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. వైస్ చైర్మన్ అప్పలనాయుడు జోక్యం చేసుకుంటూ, తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యే, మంత్రులుగా చేసిన కాలంలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంతోనే మీ పార్టీకి చెందిన కౌన్సిలర్ చెప్పుతో కొట్టుకోవాల్సి వచ్చిందని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. గతంలో ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డ్‌లలో అభివృద్ధి కోసం ,ఎంత ప్రాధేయ పడినా టిడిపి పాలకవర్గం పట్టించుకొలేదన్నారు.ఈ సమయంలో టిడిపి కౌన్సిలర్ మధు తీవ్రస్థాయిలో వైసిపి కౌన్సిలర్ల పై విరుచుకుపడ్డారు. సమస్య గురించి అడిగితే గతం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. దీంత అరుపులు, కేకలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో సమావేశం దద్దరిల్లిపోయింది.