ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్:మున్సిపల్ కార్యాలయంలో
సోమవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబాసాగా సాగింది.మున్సిపల్ చైర్ పర్శన్ గుడబండి ఆదిలక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 23 అంశాలకు సంబంధించిన అజెండాను చదివి వినిపించారు. అజెండాపై చర్చ సాగుతున్న సమయంలో 28వ వార్డు కౌన్సిలర్ డబ్బీరు శ్రీకాంత్ మాట్లాడుతూ, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల పట్ల వివక్ష చూపుతున్నారని అనడంతో వైసిపి కౌన్సిలర్ కోనేటి రామకృష్ణ కలుగు చేసుకుని అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో ఎమ్మెల్యే 28వ వార్డుకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు మాట్లాడుతూ, గత పాలకవర్గంలో వైసిపి కౌన్సిలర్లు ఉన్న వార్డులకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించని విషయాన్ని ప్రస్తావించారు. ఈ దశలో టీడీపీ కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు జోక్యం చేసుకొని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృధ్ధి పనులను వైసిపి ప్రభుత్వంలో చేసినట్లు చెబుతు న్నారన్నారు. వైసిపి పాలకవర్గం వచ్చిన తర్వాత నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపణలు చేశారు. టీడీపీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ నర్సీపట్నంకు మంజూరైన భారీ మంచినీటి సరఫరా పథకంలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంకులకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కనకారావు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.










