
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో యువతి సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు కృష్ణకిషోర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని గుంటూరు అర్బన్ ఎస్‌పి ఆరీఫ్ హఫీజ్ శనివారం మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్‌పి ఆరీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. తాడేపల్లి బోసుబమ్మ సెంటర్‌కు చెందిన కృష్ణ కిషోర్, అతని స్నేహితుడు షేక్ అబీబ్ కలిసి అత్యాచార ఘటనకు ముందు ఒక హత్య చేశారని తెలిపారు. రైల్వే వంతెనపై రాగితీగలు చోరీ చేస్తుండగా చూశాడని పల్లీలు అమ్ముకునే వ్యక్తిని నిందితులు హతమార్చారన్నారు. అతని మృతదేహాన్ని కృష్ణానదిలో పడేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. ఆ తరువాత కృష్ణాతీరంలో ఇసుక తిన్నెలపై ఉన్న జంటను చూశారన్నారు. కాబోయే భర్తతో ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు కార్పెంటెర్ ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకటరెడ్డి పరారీలో ఉన్నాడని ఎస్‌పి పేర్కొన్నారు. అదనపు ఎస్‌పి ఈశ్వరరావు పర్యవేక్షణలో మంగళగిరి డిఎస్‌పి దుర్గా ప్రసాద్, సిఐలు పి.శేషగిరిరావు, ఎం.సుబ్రహ్మణ్యం, పోలీసులు వీరు చేసిన నేరాలకు సంబంధించిన ఆధారాల సేకరణకు బాగా శ్రమించారని ఎస్‌పి తెలిపారు.