Jan 12,2023 00:03

వినతిపత్రం ఇస్తున్న అప్పలరాజు, కార్మికులు

ప్రజాశక్తి-ఎస్‌.రాయవరం:గడచిన నాలుగు నెలలుగా మూసివేసిన కోస్టల్‌ గోల్డ్‌ రొయ్యల పరిశ్రమను కంపెనీ యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు తెరిపించాలని స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు కార్మికులు వినతిపత్రం అందించారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రెండవ రోజు ధర్మవరం అగ్రహారం గ్రామంలో పాల్గొన్న పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబూరావుకి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు ఆధ్వర్యంలో కార్మికులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, కార్మికులు మాట్లాడుతూ, గత 4 నెలలుగా కంపెనీని మూసివేయడంతో చేయడానికి పనులు లేక పూర్తిగా వేతనాలు లేక అర్ధాకలితో జీవిస్తున్నామని తెలిపారు. తమను ఆదుకోవాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ నడపడానికి ప్రభుత్వం నుండి కావలసిన అనుమతులు అన్నీ వచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన శాసనసభ్యులు గొల్ల బాబూరావు కంపెనీని తెరిపించి నడిపించే విధంగా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారన్నారు.కంపెనీ మూసివేసిన నాటికి పని చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇచ్చే విధంగా యాజమాన్యంతో మాట్లాడతానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కలిగట్ల మాణిక్యం, మాజీ సర్పంచ్‌ వెదుళ్ళ బంగారి, నాయకులు శ్రీపాదుల గోవిందరావు, కర్రి నాగేశ్వరరావు, కర్రి శ్రీను బాబు, పోలిశెట్టి శ్రీనువాసరావు, నగిరెడ్డి ఆది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.