ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
ప్రపంచవ్యాప్తంగా పోలియో నివారణకు రోటరీ క్లబ్ చేస్తున్న కృషికి చేదోడుగా స్థానిక ప్రతిభ విద్యార్థులు రూ.32 వేలు ఆర్థిక సహకారం అందించడం హర్షణీయమని రోటరీ అధ్యక్షులు దాకారపు కృష్ణ అన్నారు. రోటరీ కార్యదర్శి వూడా రాంగోపాల్ నిర్వహణలో స్థానిక సుబ్బారెడ్డి కాలనీలోని ప్రతిభ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల నుంచి సేకరించిన విరాళాలను రోటరీ పోలియో నిధికి అందించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు దాకారపు కృష్ణ మాట్లాడుతూ సామాజిక సేవలో విద్యార్థులకు నైతిక, మానవీయ విలువలను అలవర్చడం గొప్ప అవకాశమన్నారు. ఈ క్రమంలో ప్రతిభా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ కాసర లక్ష్మీసరోజారెడ్డి తీసుకునే శ్రద్ధ ఆదర్శమమన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు కాళ్ల వెంకట రామారావు, ధనకుమార్, కొమ్ముకూరి నాగేశ్వరరావు, రొంగల దేవీప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు.










