ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి : రోడ్డు రోలర్ కింద పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన పెదకాకాని మండలం కొప్పురావూరు అడ్డరోడ్డు వద్ద మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తాడికొండకు చెందిన షేక్ మాబూ సుభాని గుంటూరు ఆటోనగర్ నుంచి ద్విచక్ర వాహనంపై భార్య, చిన్నపిల్లాడితో కలసి తాడికొండ వెళ్తున్నాడు. కొప్పూరావూరు అండర్ పాస్ బ్రిడ్జి వద్ద తారు రోడ్డు వేస్తుండగా పక్కనే ఉన్న చిన్నపాటి ఖాళీలో స్కూటిపై సుభాని బండిని పోనిస్తుండగా అది స్కిడ్ అయి పడిపోయింది. దీంతో సుభాని, అతని భార్య గౌసియా రోడ్డు పక్కన కింద పడగా మూడేళ్ల బాబు షేక్ సమీర్ రోడ్డుపైపడ్డాడు. అప్పటికే తారు రోడ్డును చదును చేస్తున్న రోడ్ రోలర్ బాలుడిపైకి ఎక్కింది. దీంతో బాలుడి అక్కడికక్కడే నుజ్జు అయ్యాడు. దీంతో సుభాని, గౌసియా కన్నీరు మున్నీరుగా విలపించారు. ఛిద్రమైన బాలుడి దేహాన్ని గౌసియా ఒళ్లో పెట్టుకుని విలపిస్తున్న తీరు అక్కడివారిని కలిచివేసింది. రోడ్డునిర్మాణం జరుగుతున్నందున చిన్నపాటి స్థలంలో వెళ్లవద్దని గౌసియా భర్తను వారిస్తున్నా ముందుకు వెళ్లడంతో బండి రోడ్డు అంచుకు తగిలి కింద పడటంతో ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తాడికొండలో చిరు వ్యాపారం చేసుకుని జీవించే వీరిద్దరూ వ్యక్తిగత పనిమీద ఆటోనగర్ వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పెదకాకాని సిఐ బండారు సుబ్బారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










