Jul 03,2023 01:02

సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన చికిత్సలు అందించడంతోపాటు వారు సంతోషంగా ఇంటికి వెళ్లేలా కృషి చేస్తామని ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌ తెలిపారు. రోగులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, దిగువ స్థాయి సిబ్బంది సేవలు పెంచడం ద్వారా రోగులకు మరింత సంతృప్తికరమైన వాతావరణం ఏర్పరుస్తామని తెలిపారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను తెలిపారు.
ఆస్పత్రిలో మీ మొదటి ప్రాధాన్యత?
రోగుల సంరక్షణ, అత్యవసర కేసులు, సత్వర వైద్యం అందించడమే మొదటి ప్రాధాన్యంగా భావిస్తున్నాం. అందుబాటులో వైద్యసిబ్బంది, మానవత్వంతో కూడిన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం. అత్యవసర చికిత్స విభాగం సమన్వయ పరచి సత్వర చికిత్సకు చర్యలు తీసుకుంటాం. ఆధునిక ల్యాప్రోస్కోపి వైద్యం పేదలకు అందుబాటులోకి తెస్తాం. సిబ్బందిలో జవాబుదారీతనం పెంపునకు చర్యలు తీసుకుంటాం. అన్నిరకాల మందులు పరీక్షలు ఉచితంగా పేదలకు అందిస్తాం.
శస్త్ర చికిత్సల్లో జాప్యాన్ని ఎలా నివారిస్తారు?
అత్యవసర వైద్య విభాగంలో ఆపరేషన్‌ గదుల పెంపునకు కృషి చేస్తాం. అత్యవసర విభాగంలోకి వచ్చిన గంటా రెండు గంటల్లోనే అత్యవసర ఆపరేషన్లు చేసేలా కృషి చేస్తాం. గతంలో ఉన్న జాప్యాన్ని నివారిస్తాం. వార్డుల్లో లివర్‌, కిడ్నీ,కాఖ్లియార్‌, కీళ్ల మార్పిడీ, గుండె, క్యాన్సర్‌ ఆపరేషన్లు రోజువారి చేయడానికి కృషి చేస్తాం. ఆరోగ్యశ్రీ చికిత్సలు ఎక్కువ జరిగేలా చర్యలు తీసుకుంటాం? గైనిక్‌ వార్డులో తల్లి-బిడ్డ వైద్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం.
పరిశుభ్రతకు తీసుకునే చర్యలు?
పరిశుభ్రత, పచ్చదనం కై క్లాప్‌ క్లీన్‌ ఎపి విధానం ద్వారా జగనన్న స్వచ్ఛ సంకల్పను మరింత సమర్ధవంతంగా అమలు చేస్తాం. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తాం. రోగుల సహాయకులు ఎక్కువ మంది రావడం వల్ల పెరుగుతున్న అపరిశుభ్రమైన పరిస్థితిపై పారిశుధ్య విభాగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తాం. టారులెట్‌ల నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండేలా చూస్తాం.
పెరుగుతున్న రోగుల దృష్ట్యా పెరగాల్సిన సౌకర్యాలు?
మంచాల సంఖ్య పెరగాల్సి ఉంది. స్ట్రక్చర్‌పై చికిత్సలు చేయకుండా ప్రతి ఒక్కరికి మంచాలు అందుబాటులో ఉంచేలా ప్రయత్నిస్తాం. ఎంసిహెచ్‌ బ్లాక్‌ నిర్మాణం పూర్తయితే ఈ సమస్య చాలావరకు తగ్గుతుందని భావిస్తున్నాం. జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో రోగుల తాకిడి ఎక్కువగా ఉందని, ఉన్న మంచాలు సరిపోవడం లేదని సిబ్బంది తన దృష్టికి తీసుకురాగానే 50 మంచాలు అదనంగా కేటాయించాం.
అంబులెన్సు నిర్వహకుల దందా నివారిస్తారా?
అంబులెన్స్‌ నిర్వహణపై నియంత్రణ పెంచుతాం. మహప్రస్థానం, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ అంబులెన్సుల వద్ద లంచాలు, దందాలను అరికడతాం.
నిధుల కొరతతో అభివృద్ధి నిలిచిపోతుందా?
అన్నింటికి ప్రభుత్వంపై ఆధారపడకుండా దాతల సహకారంతో ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. కొన్ని ముఖ్యమైన పనులు దాతల సహకారంతో పూర్తిచేస్తాం.
ఆస్పత్రిలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ సమస్య?
అస్తవ్యస్త పార్కింగ్‌పై దృష్టిసారించి క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటాం. వాహనాల పార్కింగ్‌ సక్రమంగా జరిగేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.