ప్రజాశక్తి - మండవల్లి
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అవసరమైన అన్నిసేవలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి స్పష్టం చేశారు. మండలంలోని తక్కెళ్లపాడులో రెండో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని ఆమె గురువారం పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తే రోగులు ఆసుపత్రికి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడం, ఆసుపత్రి ముందు పంట కాలువ ఉండటంపై ఆ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు ఆమె నిరాకరించారు. ఆరోగ్య కేంద్రం వెనుకే కొల్లేరు ఉండటంతో ఎగువ ప్రాంతాల నుండి వరద వస్తే ఆసుపత్రి మునిగిపోయే ప్రమాదం ఉందని ఇక్కడ ఎలా నిర్మిస్తారని ఆమె ప్రశ్నించారు. గ్రామంలో ఇంకా ఎక్కడైనా ఖాళీ ప్రాంతం ఉందా అని అడిగి తెలుసుకున్నారు. దీంతో ఎంపిపి పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ జెసితో మాట్లాడారు. జగనన్న కాలనీని నిర్మించే విధంగా స్థానిక శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు చొరవతో స్థలాన్ని ఎంపిక చేసి పూర్తిస్థాయిలో మేరక చేయించామని, అంతేకాకుండా పిహెచ్‌సికి వెళ్లేందుకు కాలువపై వంతెన నిర్మాణానికి మండల పరిషత్ నుండి నిధులు మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆమె దృష్టికి తీసుకు వచ్చారు. తక్కెళ్లపాడులో ఆస్పత్రి నిర్మిస్తే సుమారు పది గ్రామాలకు చెందిన రోగులు వైద్య సేవలు పొందేందుకు అవకాశం ఉంటుందని ఆయన జెసికి వివరించారు. స్థలానికి సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేసి పంపించాలని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి చేబ్రోలు సుధారాణి, పార్టీ మండల అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు బొమ్మనబోయిన గోకర్ణయాదవ్, సర్పంచుల సంఘం అధ్యక్షులు బేతపూడి ఏసేబురాజు, సర్వేయర్ బసవరాజు, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.










