Aug 18,2023 00:40

సమావేశంలో మాట్లాడుతున్నా సర్పంచ్‌ శ్రీనివాసరావు

ప్రజాశక్తి-ప్రత్తిపాడు : మండలంలోని రోడ్డులన్నీ అధ్వానంగా ఉన్నాయి.. కనీసం మరమ్మతులైనా చేయండి అని మండలంలోని తిమ్మపురం సర్పంచ్‌ కల్లూరి శ్రీనివాసరావు మండల పరిషత్‌ సమావేశంలో కోరారు. ఎంపిపి దాసరి అన్నమ్మ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో అర్‌ అండ్‌ బి అధికారి మాట్లాడుతున్న సందర్భంలో సర్పంచ్‌ శ్రీనివాసరావు కలుగజేసుకున్నారు. మండలంలోని దాదాపు అన్ని రోడ్లు బాగాలేదని, జనం బాగా ఇబ్బంది పడుతు న్నారని చెప్పారు. మీరు చేయకుంటే తామే చందాలు అడుక్కుని మరమ్మతులు చేయించుకోవాల్సి వస్తుందని ఆవేదన వెలిబుచ్చారు. తమ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో పెళ్లికి పిల్లనివ్వడానికీ ఇతరులు వెనకాడుతున్నారని నడిపాలెం-1 ఎంపిటిసి వాసిమళ్ల మాణిక్యరావు అన్నారు. త్వరలోనే మరమ్మతులు చేయి స్తామని అధికారులు సమాధానమిచ్చారు. నాలుగు నెలల్లో గొట్టిపాడు రోడ్డునూ పూర్తి చేస్తామని, చిన్నకొండ్రుపాడు రోడ్డు కాంట్రాక్టర్‌తో మాట్లాడతామని చెప్పారు.
విద్యుత్‌ బిల్లుల పేరుతో అదనపు వసూళ్లు
పంచాయతీలోని విద్యుత్‌ బకాయి పేరుతో డబ్బులు కట్‌ చేసుకుంటున్నారు.. అసలు పంచాయతీలు ఎంత బకాయి ఉన్నాయి? ఎంత కట్‌ చేస్తున్నారు? అని ఎంపిడిఒ శ్రీరమ్యను తిమ్మాపురం సర్పంచ్‌ ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వాలంటూ లేఖను ఇచ్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే తమ పంచాయతీ పరిధిలో ఉంటున్న విద్యుత్‌ స్తంభాలపై పన్నులు వేయాల్సి ఉంటుందని అసహనం వెలిబుచ్చారు.