ప్రజాశక్తి - సీతానగరం: మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి అజ్జాడ వరకు వెళ్లే రోడ్డు గోతులమయంగా తయారైంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాక రోడ్డుకు ఇరువైపులా కాలువలు లేకపోవడంతో నీరు నిల్వ ఉండడంతో ఎక్కడికక్కడే గుమ్ములు తయారై ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికెే పలుమార్లు జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్య తెలిపినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సత్వరం రోడ్లు బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
పాచిపెంట : మండలంలోని కొటికిపెంట పంచాయతీ కొత్తవలస బిసి కాలనీ సిసి రోడ్డు వేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆ కాలనీ వాసులు బి.సత్యనారాయణ, కె.దినేష్, బి.నూకరాజు, పి.పోలినాయుడు, ఎం.రమేష్, బి.వెంకటసత్యం అధికారులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్డు పూర్తిగా నాశనమైందని, వెంటనే సిసి రోడ్డు వేసి ఈ గుమ్ములు కప్పి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. లేకుంటే చిన్నపాటి వర్షాలకు ఇటువంటి నీరు ఏర్పడి దోమలతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సిసి రోడ్డు మంజూరు చేసి తమ కాలనీకి ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి, అధికారులకి విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం చేయకపోతే ఎంపిడిఒ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు..










