ప్రజాశక్తి-చింతూరు
చింతూరు డివిజన్ కేంద్రంలోని ఎస్టీ, బీసీ కాలనీల వాసులు అధ్వాన రహదారులు, తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీల్లో అంతర్గత రహదారులు పూర్తి శిథిలమైన నడిచేందుకు వీల్లేకుండా ఘోరంగా ఉన్నాయి. వర్షాలు పడితే, వరదలొస్తే బురద గుంటల్లో రాకపోకలు సాగించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. అయినా అధికారులు, పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం దురదృష్టకరం. సీసీ రోడ్లు మంజూరయ్యాయని, అదిగో వేస్తున్నాం ఇదిగో వేస్తున్నామంటూ పదేళ్ల నుండి ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు. ఏజెన్సీలో చింతూరు డివిజన్ కేంద్రంలోని ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల పరిస్థితి చెప్పనక్కరలేదు.
జల్ జీవన్ మిషన్ పథకం కింద ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ చేపట్టిన ఇంటింటికి కుళాయిల పనులు మూడు నెలలుగా మూలుగుతున్నాయి. ఈ పనుల నిమిత్తం ఇప్పటికే ఉన్న వీధి కుళాయిలను తవ్వేశారు. కొత్తగా ఇంటింటికి తాగునీటి కుళాయి పనులను ఏ కారణం చేతో తెలియదుగాని మధ్యలో నిలిపివేశారు. దీంతో తాగునీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వేసవి కాలం సమీపిస్తుండటంతో తాగునీరు లేక ఎస్టీ బీసీ కాలనీలవాసులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు చింతూరు మండల కేంద్రం నుండి గిరిజన గ్రామమైన కన్సులూరు వరకు కోటీ 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బీటీ రోడ్డు వేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పెచ్చులూడిపోయాయి. శిథిలమై పాడుబడిన రోడ్డును తలపిస్తుంది. అంటే ఈ రహదారికి కేటాయించిన నిధులు కాంట్రాక్టరు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ మేరకు తినేశారో అర్థం చేసుకోవచ్చు. నాసిరకం రోడ్ల నిర్మాణంపై అధికారుల దృష్టికి మీడియా తీసుకు వెళ్లినా ఏమాత్రం స్పందించకుండా మిన్నకుండిపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని స్థానికులు చెబుతున్నారు.
త
మా బజారుకు రోడ్లు వేయడం లేదు
పది సంవత్సరాలుగా మా బజారులో రోడ్లు శిథిలమై, గోతులమయంగా ఉన్నాయి. బజారులో నడిచేందుకు రోడ్డు సరిగా లేదు. వరదల్లో కొట్టుకుపోయి గోతులు పడి ప్రమాదకరంగా ఉన్నాయి. వరదల సమయంలో గోతుల్లో దిగి సామాన్లను మోసుకుంటూ వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అయినా అధికారులు, పాలకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. మా కాలనీకి అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చిన ప్రతిసారీ ఇదిగో వేస్తామని చెప్పి తరువాత ముఖం చాటేస్తున్నారు. వెంటనే సిసి రోడ్లు నిర్మాణం చేయాలి.
- కోట్ల పెరుమాళ్ళు, బీసీ కాలనీ, చింతూరు.
వేరే బజారు నుండి నీటిని తెచ్చుకుంటున్నాం
ఇంటింటికీ తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఉన్న నల్ల పైపులను తొలగించారు. మూడు నెలలు కావస్తున్నా తిరిగి వాటిని ఏర్పాటు చేయలేదు. వేసవికాలం ప్రారంభమవుతున్న కొద్దీ మాకు నీటి ఎద్దడి అధికమైంది. తాగేందుకు మంచినీళ్లు లేవు. వేరే బజారుకు వెళ్లి నీళ్లు మోసుకొని తెచ్చుకుంటున్నాం. తక్షణమే పైపులైను ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పించాలి.
- సున్నం ఆదెమ్మ, ఎస్సీ కాలనీ, చింతూరు










