Sep 23,2023 00:13

ప్రజాశక్తి - భట్టిప్రోలు
మండలంలో నాలుగు మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఏ ఒక్క గ్రామంలో  మురుగు నీటి పారుదల సౌకర్యం లేదు. కొద్దిపాటి వర్షానికి రహదారులు నీట మునుగుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. మేజర్ పంచాయతీ భట్టిప్రోలులో గతంలో మురుగు నీటి పారుదలకు పక్కా డ్రైన్‌ నిర్మాణం చేసినప్పటికీ అది పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు. ఐలవరం, వెల్లటూరు, పెదపులువరు గ్రామాలలో ఒక్క డ్రైన్‌ కూడా నిర్మించలేదు. ఐలవరంలో వర్షపు నీరు బయటకు పోయే మార్గం లేక రహదారుల పైనే నిల్వ ఉంటున్నాయి. ప్రజలకు తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తున్నాయి. గ్రామంలో  ప్రధాన రహదారైన లైబ్రరీ సెంటర్, శివాలయం సెంటర్, భావన రుషి దేవస్థాన  సమీపం నుండి సచివాలయానికి వెళ్లే మార్గంలో రామ మందిరం వరకు రోడ్డు వెంబడి డ్రైన్‌ లేకపోవడంతో వర్షపు నీటితో రహదారులు మునిగిపోయి ఉంటాయి. ఎంతమంది పాలకులు మారినా డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారిస్తున్న దాఖలాలు లేవని గ్రామస్తులు వాపోతున్నారు. వెల్లటూరు ప్రధాన రహదారి కూడా కొద్దిపాటి వర్షానికే రహదారిపై మోకాలి లోతు నీరు నిలబడి రాకపోకలు ఇబ్బందిగా మారాయి. కృష్ణా నది పరివాహక లంక గ్రామాల నుండి కూడా ప్రజలు వివిధ పనులపై వెల్లటూరు నుండే వస్తూ ఉంటారు. ప్రభుత్వ వైద్యశాల నుండి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు మొత్తం నీటితోనే నిండిపోయి ఉంటుంది. దీంతో చిరు వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెదపులివర్రులో కార్పొరేషన్ బ్యాంక్, రోహిణి రైస్ మిల్ ప్రాంతంలో రహదారుల పల్లంగా ఉండి వర్షపు నీరు నిలబడుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కనీసం మేజర్‌ పంచాయితీల్లోనైనా నీటిరుపాదులకు అనువుగా కాలువలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.