Jan 04,2023 23:52

మాట్లాడుతున్న బాలకృష్ణ, చిత్రంలో వివిధ సంఘాల నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి
రోడ్లపై ర్యాలీలు, ప్రదర్శన, సభలు నిర్వహించరాదని రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి తెచ్చిన జీవో 1 అప్రజాస్వామికమని, దానిని తక్షణమే రద్దు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక కర్షక నిలయంలో బుధవారం అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యాన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముదనష్టపు పాలన వల్ల ప్రజా సమస్యలు పెరిగాయని, వాటిని పరిష్కరించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలను బెదిరించి నియంతృత్వ ధోరణితో ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేసేందుకు ఈ జీవో తెచ్చారని విమర్శించారు. సిఐటియు నాయకులు బి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యలపై పోరాటం చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ఏఐటియుసి నాయకులు వైఎన్‌ భద్రం, రైతు సంఘం నాయకులు కోరిబిల్లి శంకర్రావు, టిఎన్‌టియుసి నాయకులు బుద్ధ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కును ఉపయోగించుకునే జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన సంగతి మరిచిపోరాదని హితవుపలికారు. జీవో 1ని రద్దు చేయకుంటే ప్రజాస్వామ్య పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమించాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు కె.ఈశ్వరరావు, కార్యాలయ కార్యదర్శి ఎ.రాజు, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి బి నూక అప్పారావు, కౌలు రైతు సంఘం నాయకులు, పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జీవో 1ను ఉపసహరించుకోవాలి : సిఐటియు
పరవాడ : రాష్ట్రంలో రోడ్‌ షోలు ర్యాలీలు సభలు నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ ఒకటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ జీవో తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పు అన్నారు. కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, పౌర హక్కు సంఘాలు, న్యాయ వాదులు ప్రజలు ఈ జిఒను వ్యతిరేకించాలని గనిశెట్టి విజ్ఞస్తి చేశారు.
చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే : టిడిపి
పరవాడ: అప్రజాస్వామికమైన జీవో నెంబర్‌ 1ని వెంటనే రద్దు చేయాలని టిడిపి మండల అధ్యక్షులు వియ్యపు చిన్నా బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడే గొంతులను అణదొక్కేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసిందని ఆరోపించారు. టిడిపి అధినేత చంద్రబాబు సభలు, సమావేశాలు, రోడ్‌ షోలకు ప్రజల నుంచి అశేషమైన ప్రజాదరణ వస్తుండడంతో చూసి ఓర్చుకోలేకే ఈ జీవో తెచ్చిందని విమర్శించారు.
జిఒ 1ని రద్దు చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం
ప్రజాశక్తి-అనకాపల్లి
రోడ్‌ షోలు, సభలు, ర్యాలీలు రోడ్లపై నిర్వహించరాదంటూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ ఒకటిని తక్షణమే ఉప సంహరించుకోవాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రజాభిప్రాయాలను చెప్పుకోవడంపై ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమన్నారు. గతంలో జగన్మోహన్‌ రెడ్డి రోడ్‌ షోలు, ర్యాలీలు సభలు, పాదయాత్రలు వంటివి రహదారులపై చేయలేదా? అని ప్రవ్నించారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ నిరసనలు తెలియజేయకుండా ఇటువంటి జీవోలు విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రతిపక్షాలు, ప్రజాతంత్ర వాదుల నోరునొక్కే ఈ దుర్మార్గపు అనాలోచిత నిర్ణయాన్ని ప్రజాతంత్ర వాదులు, రాజకీయ పక్షాలు, పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.