
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చిన్న పాటివర్షాలకే రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. కొన్నేళ్లుగా రహదారులు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చాలా మార్గాల్లో రహదారుల పరిస్థితి దారుణంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌టిసి బస్సులు నడపటం చాలా కష్టంగా ఉందని డ్రైవర్లు వాపోతున్నారు. ఇందువల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు దెబ్బతింటున్నాయి. డెల్టా ప్రాంతంలో చాలా గ్రామాల్లో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి.
గుంటూరు-పొన్నూరు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. పొన్నూరు-చందోలు ప్రధాన రహదారి దెబ్బతిన్నా తాత్కాలిక మరమ్మతులతో కాలక్షేపం చేస్తున్నారు. గుంటూరు-పేరేచర్ల-వయా పెదపలకలూరు రోడ్డు పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉంది. ఈ రహదారికి సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలో తమ పనులు అయ్యాయని ఆర్‌అండ్‌బి అధికారులు రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. దాదాపు కిలో మీటరు వరకు ఈ రహదారి గుంతల మయంగా మారింది. మూడేళ్లుగా కాలయాపన చేస్తున్నారు. నల్లపాడు-అంకిరెడ్డిపాలెం రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. మేడికొండూరు మండలం సరిపూడి-మందపాడు, మేడికొండూరు-14వ మైలు, ఫిరంగిపురం -గరుడాచలవారిపాలెం, ఫిరంగిపురం- పొనుగుపాడు, గుంటూరు-చిలకలూరిపేట బైపాస్ రహదారి, గుంటూరు- నందివెలుగు రోడ్డు పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. రాజధాని ప్రాంతంలో అమరావతి- విజయవాడ మార్గంలో పలుచోట్ల దెబ్బతిన్నా కనీస మరమ్మతులు జరగడం లేదు. కొల్లిపర -తెనాలి -శిరిపురం మార్గంలో భారీ గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.
గుంటూరు ఆటోనగర్ నుంచి నల్లపాడు- చిలకలూరిపేట జాతీయ రహదారికి అనుసం ధానం చేసే (మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు) నాలుగు లైన్ల రహదారి మూడో దశ పనులు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. గుంటూరు అడవితక్కెళ్లపాడు నుంచి పలక లూరు వరకూ చేపట్టాల్సిన పనులపై పదేళ్లుగా కాలయాపన చేస్తున్నారు. నాలుగేళ్లలో జిల్లాలో కొన్ని రోడ్లుమాత్రమే మరమ్మతులు చేయగా ఇంకా దాదాపు100కుపైగా రోడ్లు మరమ్మ తులకు నోచుకోవడం లేదు. తాత్కాలిక మరమ్మతులు చేసినా వర్షాకాలం వచ్చేసరికి రోడ్లు గుంతలు, గోతులతో వాహనాలు వెళ్లేం దుకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోంది. అత్యవ సరమైన పనులకుతప్ప వర్షాలకు దెబ్బతిన్న రహదారుల నిర్మాణం కోసం ఆర్‌అండ్‌బికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయకపోవడం వల్ల రహదారుల పరిస్థితి మెరుగు పడటంలేదు.