
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ప్రధాన రహదారుల విస్తరణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. శుక్రవారం పెదపలకలూరు రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన పలకరూరు రోడ్డులోని రత్నగిరి నగర్‌లో ఏర్పాటు చేసిన టి.డి.ఆర్ బాండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించటానికి ప్రధాన రహదారులను విస్తరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే రామనామక్షేత్రం రోడ్డు, కొత్తపేట శివాలయం రోడ్డు, ఏ.టి అగ్రహారం రోడ్డు తదితర రోడ్ల విస్తరణ పూర్తయినట్లు చెప్పారు. పెదపలకలూరు రోడ్డు విస్తరణకు స్థానిక ప్రజలు సహకరించారన్నారు. విస్తరణలో ప్రభావితం అవుతున్న నిర్మాణాలకు నష్టపరిహారం అందజేసినట్లు చెప్పారు. స్థలం కోల్పోతున్న వారికీ నిబంధనల ప్రకారం టిడిఆర్ బాండ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. పెదపలకలూరు రోడ్డుకు సైడు కాల్వలు నిర్మించటం పూర్తి అయ్యిందని, సెంటర్ డివైడర్ పనులు నిర్వహణకు కూడా టెండర్ ప్రక్రియ పూర్తి అయినట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బి అధికారులు త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేసేలా వారితో చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఏరువ సాంబిరెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఏ.సి.పి అజరు కుమార్ పాల్గొన్నారు.