Nov 19,2023 00:27
గుంతల రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఆయా పార్టీల నాయకులు

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌: తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా 'గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది' పేరుతో బల్లికురవ మండలం సూరేపల్లి గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు. రహదారుల్లో చిన్న చిన్న గోతులను కూడా పూడ్చలేని దుస్థితిలో ఈ చేతకాని ప్రభుత్వం ఉందని నాయకులు ధ్వజమెత్తారు. రహదారుల దుస్థితిపై బల్లికురవ మండల టీడీపీ, జనసేన సంయుక్తంగా 'గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది' పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. సూరేపల్లి రోడ్డులో ఉన్న గుంతల వద్ద నిరసన తెలిపారు. సైకో రాజ్యంలో రోడ్లు నాశనం అంటూ నినదించారు. టిడిపి హయాంలో గొట్టిపాటి రవికుమార్‌ సారధ్యంలో అద్దంకి నియోజకవర్గంలో బిటి రోడ్లు రూ.174 కోట్లతో 274 కి.మీ రోడ్లు వేశారని గుర్తు చేశారు. ఒక్క ఛాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నాశనం చేశారని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వంలో ప్రజలు గుంతల రాజ్యం చూడాల్సిన పరిస్థితి వచ్చిందని నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నేతలు పాల్గొన్నారు.